పోటెత్తిన జూరాల, శ్రీశైలం
ABN , First Publish Date - 2020-10-01T07:35:47+05:30 IST
ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల.....
కొనసాగుతున్న నీటి విడుదల
సాగర్‌కు తగ్గిన వరద ఉధృతి
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 14 గేట్ల ద్వారా 98,896 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.50 మీటర్ల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయంలోకి 1,43,336 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 4 గేట్లను ఎత్తి కుడి గట్టు జలవిద్యుత్తు కేం ద్రంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 1,42,114క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జునసాగర్‌కు వరద రాక తగ్గింది. 12 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది.
పులిచింతల ఫుల్ !
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులు కాగా, 174.57 అడుగులకు చేరుకుంది. 1,42,691 క్యూసెక్కుల నీరు వస్తుండగా; 99,915క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టుకు 1000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 644 అడుగులకు చేరుకుంది.
భారీ వర్ష బీభత్సం
భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా కాల్వతండాలో మెగావత్ కవిత (35), కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో గీత కార్మికుడు శంకరయ్య గౌడ్(50) పిడుగుపాటుకు మృతి చెందారు.