‘సార్‌’ జిల్లాపై చిన్నచూపు

ABN , First Publish Date - 2020-12-13T05:33:40+05:30 IST

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో ఏర్పడిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా కలెక్టర్‌తో సహా కీలకమైన జిల్లా స్థాయి అధికారుల పోస్టులన్నీ ఇన్‌చార్జిల పాలనలో మగ్గుతున్నాయి. పాలనలో కీలకమైన ఎస్పీ పోస్టును 14 నెలలుగా భర్తీ చేయనేలేదు. తెలంగాణ కోసం ఉద్యమించిన జయశంకర్‌ సార్‌ పేరుతో ఏర్పాటు చేసిన జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

‘సార్‌’ జిల్లాపై చిన్నచూపు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఇన్‌చార్జి అధికారుల పాలన
జిల్లా కలెక్టర్‌ సహా ముఖ్య అధికారులంతా ఇన్‌చార్జీలే..
14 నెలలుగా ఎస్పీ పోస్టు ఖాళీ
పూర్తిస్థాయి అధికారుల నియామకంలో జాప్యం
జిల్లాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రజల విమర్శలు


తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో ఏర్పడిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా కలెక్టర్‌తో సహా కీలకమైన జిల్లా స్థాయి అధికారుల పోస్టులన్నీ ఇన్‌చార్జిల పాలనలో మగ్గుతున్నాయి. పాలనలో కీలకమైన ఎస్పీ పోస్టును 14 నెలలుగా భర్తీ చేయనేలేదు. తెలంగాణ కోసం ఉద్యమించిన జయశంకర్‌ సార్‌ పేరుతో ఏర్పాటు చేసిన జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి
ప్రభుత్వం 2016 అక్టోబరు 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. సింగరేణి కార్మికులు, ఆదివాసీల అత్యధికంగా ఉన్న భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలతో పాటు మంథని, భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని మొత్తం 20 మండలాలలతో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో జయశంకర్‌భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో రెండో పెద్ద జిల్లాగా ఏర్పడింది. అయితే జిల్లా ఏర్పడిన 28 నెలల్లోనే 2019 ఫిబ్రవరి 17వ తేదీని ములుగు రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి భూపాలపల్లి జిల్లాను 11 మండలాలకే పరిమితం చేశారు. దీంతో రాష్ట్రంలో అతి చిన్న జిల్లాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

కలెక్టర్‌, ఎస్పీ ఇన్‌చార్జీలే..
మహరాష్ట్ర, చత్తీ్‌సగడ్‌ రాష్ర్టాలకు సరిహద్దుతో పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలోనే ఉంది. సింగరేణి, జెన్‌కో లాంటి కీలకమైన పరిశ్రములు కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఏటా వేల కోట్ల రుపాయల అదాయం అందిస్తున్న ఇసుక రీచ్‌లు ఇక్కడివే. ఇంత కీలకమైన భూపాలపల్లి జిల్లాకు 14 నెలలుగా ఎస్పీని నియమించలేని దుస్థితి నెలకొంది. 2019 అక్టోబరు 4వ తేదీన భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్‌ను సూర్యాపేట అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో బదిలీ చేశారు. అప్పటి నుంచి ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటీల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక గత నవంబరు 8వ తేదీన భూపాలపల్లి జిల్లా అబ్దుల్‌ అజీమ్‌పై బదిలీ వేటు పడింది. ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్యకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. నెల రోజులు గడిచిన జయశంకర్‌ జిల్లాకు కలెక్టర్‌ను నియమించక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పాలనలో కీలకమైన కలెక్టర్‌, ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటంతో జిల్లాపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు జిల్లాలకు ఒకే కలెక్టర్‌, ఒకే ఎస్పీ విధులు నిర్వహిస్తుంటే.. మరీ ఒక జిల్లానే రెండు జిల్లాలుగా ఎందుకు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇతర శాఖల్లోనూ..
కలెక్టర్‌, ఎస్పీలే కాకుండా ఇతర శాఖల్లో కూడా ఇన్‌చార్జిల పాలనే సాగుతోంది. డీఆర్‌డీఏకు నాలుగు నెలలుగా ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. బీసీ వెల్ఫర్‌ అధికారి శైలజ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ములుగు డీఎ్‌ఫవో ప్రదీ్‌పకుమార్‌శెట్టికి జిల్లాకు ఇన్‌చార్జి బాఽధ్యతలు అప్పగించారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేష్‌ ఆనారోగ్యంతో దీర్ఘకాలిక సెలవులో రెండు నెలలుగా ఉన్నారు. ఈయన స్థానంలో భూపాలపల్లి ఆర్‌డీవో శ్రీనివా్‌సకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.  జిల్లా వ్యవసాయశాఖ అధికారి పోస్టు 8నెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం మహదేవపూర్‌ ఏడీఏ శ్రీనివాసరాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సివిల్‌ సప్లయ్‌ జిల్లా అధికారి గౌరి శంకర్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో సివిల్‌ సప్లయి మేనేజర్‌ రాఘవేందర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టు 8నెలల నుంచి ఖాళీగా ఉంది. ఇటీవల వరంగల్‌ అర్బన్‌ విద్యాశాఖలో పని చేస్తున్న అబ్దుల్‌హైకి అదనపు బాఽధ్యతలతో డీఈవోగా నియమించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పోస్టు ఏడాదన్నరకాలంగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లా మలేరియా ప్రత్యేకాధికారిగా ఉన్న సుధార్‌సింగ్‌కు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించారు. నీటి పారుదల శాఖ అధికారి పోస్టు ఆగస్టు నుంచి ఖాళీగా ఉంది. ప్రస్తుతం కంతనపల్లి ప్రాజెక్టు అధికారి జగదీ్‌షను ఇన్‌చార్జిగా నియమించారు. మైనింగ్‌ ఏడీ పోస్టు 22నెలలుగా ఖాళీగా ఉంది. ఈ పోస్టులో వరంగల్‌ రూరల్‌ జిల్లా ఏడీ రవీందర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి భిక్షపతి రెండు నెలల కిందట నిజామాబాద్‌కు బదిలీ కాగా, ఆయన స్థానంలో వరంగల్‌ రూరల్‌ సీపీవో సామ్యేల్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇవే కాకుండా మండల, డివిజన్‌ స్థాయిలో అన్ని శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అభివృద్ధికి ఆటంకం
కొన్నాళ్లుగా జిల్లాస్థాయి అధికారులు బదిలీలపై వెళ్లటంతో అంతా ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. దీంతో ప్రభుత్వ పథకాలపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్‌డీఏకు ఐదారు నెలలుగా ఇన్‌చార్జిలే ఉండటంతో ఆసరా పింఛన్లు, ఉపాధి హమీ పనులు, మహిళలకు రుణాలు తదితర వాటిపై పర్యవేక్షణ లేకుండా పోతోంది. కిందిస్థాయి అధికారులు ఇన్‌చార్జిలను బురిడీ కొట్టించి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయశంకర్‌ పేరుతో ఏర్పాటు చేసిన భూపాలపల్లి జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి పూర్తిస్థాయి అధికారుల నియమాకంతో పాటు ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-12-13T05:33:40+05:30 IST