నడ్డా ఆరోపణలు అవాస్తవం: ఈటల

ABN , First Publish Date - 2020-06-21T20:47:45+05:30 IST

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఈటల రాజేందర్ తప్పుబట్టారు. జేపీ నడ్డా మాటలు గురువింద సామెతను గుర్తుచేస్తున్నాయన్నారు.

నడ్డా ఆరోపణలు అవాస్తవం: ఈటల

హైదరాబాద్: కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఈటల రాజేందర్ తప్పుబట్టారు. జేపీ నడ్డా మాటలు గురువింద సామెతను గుర్తుచేస్తున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోందని, దేశ రాజధానిలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. కరోనా కట్టడికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. కంటైన్మెంట్‌ అనే పదానికి నిజమైన అర్థం చెప్పామని మంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో కరోనా వస్తే మీకు తెలియలేదని, మర్కజ్‌ ఘటనలో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా అలర్ట్‌ చేశామని గుర్తుచేశారు. కరోనా విషయంలో ప్రధాని మోదీని ఇతర పార్టీలు విమర్శస్తే తప్పని చెప్పామని, కరోనా కట్టడిలో రాజకీయాలకు అతీతంగా ఉండాలని కోరామని తెలిపారు. కరోనాపై పోరులో ప్రధానికి అండగా నిలిచిన రాష్ట్రంపై ఆరోపణలు సరికాదని, జేపీ నడ్డా గల్లీ స్థాయి నాయకుడిలా వ్యాఖ్యలు చేశారని ఈటల రాజేందర్ ఆక్షేపించారు.

Updated Date - 2020-06-21T20:47:45+05:30 IST