ఫారూఖ్ అహ్మద్ చర్య క్షమించరానిది: జోగు రామన్న
ABN , First Publish Date - 2020-12-19T21:32:49+05:30 IST
ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్ చర్య క్షమించరానిదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా బాధితులకు అండగా ఉంటానని తెలిపారు.

ఆదిలాబాద్: ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్ చర్య క్షమించరానిదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా బాధితులకు అండగా ఉంటానని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను నిమ్స్‌లో చేర్పించామని చెప్పారు. దాడుల సంస్కృతి ఎవరికీ మంచిది కాదని, నిందితులు ఎంఐఎం అయినా... టీఆర్‌ఎస్ నేతలైనా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ అయినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని జోగు రామన్న సూచించారు.
పాత కక్షలను మనసులో పెట్టుకుని.. పిల్లల క్రికెట్ గొడవను ఆసరాగా చేసుకుని.. ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ (48) ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో మన్నన్ (52), అతడి కుమారుడు మోథెషిన్ (20), జమీర్ (55) అనే ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఫారూఖ్ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తుపాకీని స్వాధీనం చేసుకుని ఆయుధాల చట్టం 307, 327 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.