గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎంపీ సంతోష్ సరికొత్త కార్యక్రమం

ABN , First Publish Date - 2020-08-21T02:23:49+05:30 IST

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దేశవ్యాప్తంగా జోరుగా నడుస్తుంది...

గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎంపీ సంతోష్ సరికొత్త కార్యక్రమం

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దేశవ్యాప్తంగా జోరుగా నడుస్తుంది. తెలంగాణకు హరితహారం పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలనే ఇచ్చింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అంతరించిపోయిన అడవిని దత్తత తీసుకుని విస్తృతంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించి మళ్లీ పాత రూపుకు తీసుకొచ్చారు. కేసీఆర్ ఆలోచనలను అందిపుచ్చుకున్న సంతోష్ తాను రాజ్యసభ సభ్యుడవ్వగానే తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని నిర్ణయించారు. వివిద రాష్ట్రాల్లో, ప్రముఖ పట్టణాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అందరికి పరిచయం చేశారు. 


ప్రకృతిని ఆరాధిస్తే భగవంతున్ని ఆరాధించినట్లేనని చెప్పడం కోసం ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ స్పూర్తితో చేపట్టిన సీడ్ గణపతి, విత్తన గణపతి కాన్సెప్ట్ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. మొక్కలు కూడా దేవుడితో సమానం అని చెబుతున్నారు. ఆధ్యాత్మికతకు, ప్రకృతిని జోడించి ఈ సీడ్ గణేషా కార్యక్రమాన్ని రూపొందించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతీ ఇంట్లో రంగు రంగుల గణేషుడి విగ్రహాలు పెట్టి మంచి అలంకరణలతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజించడం సంప్రాదాయం. 


అయితే వేప విత్తనాన్ని కలిపి మట్టితో మాత్రమే గణేషుడి విగ్రహాలను తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు. తొమ్మిది రోజులు పూజలందుకోవడంతో పాటు.. అదే కుండీలో గణనాథుడ్ని నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత అందులోంచి ఆ మొక్కను బయటికి తీసి మన ఆవరణల్లో నాటుకోవచ్చు. ఆ మొక్కనే అందరు భగవంతునితో సమానంగా పరిరక్షించుకుంటారు. ఇదే సీడ్ గణేషా కాన్సెప్ట్ అని ఎంపీ సంతోష్ చెప్పారు. గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రముఖులందరికి ఈ విగ్రహాలను పంపిస్తూ ఈ కార్యక్రమం సీరియస్‌నెస్‌ను తెలియచేస్తున్నారు. ఈ విత్తన గణపతి కార్యక్రమాన్ని ‘‘గో రూరల్ ఇండియా’’ సంస్థతో కలిసి విగ్రహాల పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటిలో ఔషధ గుణాలున్న వేప మొక్క ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆశయం కూడా దీని ద్వారా నెరవేరుతుందని చెబుతున్నారు.Updated Date - 2020-08-21T02:23:49+05:30 IST