సరుకు రవాణాకు ‘జై కిసాన్‌’ రైళ్లు

ABN , First Publish Date - 2020-04-15T09:05:01+05:30 IST

కరోనాపై పోరులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన వంతు సహకారం అందిస్తోంది. ఇప్పటికే తన పరిధిలోని ఆస్పత్రులు, కమ్యూనిటీ హాళ్లు, ఇన్‌స్టిట్యూషన్లు,

సరుకు రవాణాకు ‘జై కిసాన్‌’ రైళ్లు

హైదరాబాద్‌ సిటీ/సికింద్రాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : కరోనాపై పోరులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన వంతు సహకారం అందిస్తోంది. ఇప్పటికే తన పరిధిలోని ఆస్పత్రులు, కమ్యూనిటీ హాళ్లు, ఇన్‌స్టిట్యూషన్లు, సూపర్‌ఫాస్ట్‌ రైల్వే కోచ్‌లను క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ వార్డులుగా సుందరీకరించి అందుబాటులో ఉంచింది. దీంతోపాటు కరోనా లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి 13 వరకు 160 సరుకు రవాణా రైళ్ల ద్వారా 4.38 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించింది. సరుకు రవాణాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు తాజాగా ‘జై కిసాన్‌’ ప్రత్యేక ఫ్రైట్‌ రైళ్లను ప్రారంభించింది. స్పెషల్‌ పార్సిల్‌, ఫ్రైట్‌ రైళ్లను ఒకేసారి జతచేసి నడిపించడం ద్వారా సమయం ఆదాతోపాటు ఎక్కువ మొత్తంలో సరుకును రవాణా చేసే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే సరికొత్తగా జై కిసాన్‌ సరుకు రైళ్లకు శ్రీకారం చుట్టింది.


రెండు వేర్వేరు గమ్యస్థానాల నుంచి లోడ్‌ చేసిన రెండు సరుకు రవాణా రైళ్లను సమీపంలోని జంక్షన్‌ పాయింట్‌ వద్ద జతచేస్తారు. ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో ఈ రెండు రైళ్లకు చెందిన బోగీలను ఒకే ఇంజిన్‌కు తగిలించి సులువుగా తీసుకెళ్తారు. సాధారణంగా ఒక్కో ఫ్రైట్‌ ట్రైన్‌ 42 వ్యాగన్లతో 2,600 టన్నుల సరుకును తీసుకెళ్తుంది. నూతన విధానం ప్రకారం 84 వ్యాగన్లతో  5,200 టన్నుల సరుకును రవాణా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా తొలి జై కిసాన్‌ స్పెషల్‌ ఫ్రైట్‌ ట్రైన్‌ డోర్నకల్‌ నుంచి సదరన్‌ రైల్వేకు మంగళవారం బయల్దేరింది. జైౖ కిసాన్‌ ప్రత్యేక సరుకు రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆహార ధాన్యాలను చాలా వేగంగా రవాణా చేయగలుగుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా పేర్కొన్నారు.

Updated Date - 2020-04-15T09:05:01+05:30 IST