జగిత్యాలకు దుబాయ్, ముంబై గుబులు
ABN , First Publish Date - 2020-03-25T09:44:06+05:30 IST
జగిత్యాల జిల్లాకు దుబాయ్, ముంబై గుబులు పట్టుకుంది. ఉపాధి నిమిత్తం ఈ ప్రాంతం నుంచి వేల సంఖ్యలోనే గల్ఫ్ దేశాలతో పాటు ముంబైకి వెళ్లినవారు ఉన్నారు. కరోనా

భారీ సంఖ్యలో జిల్లాకు చేరిన ప్రవాసీలు.. ఉపాధి కోసం ముంబై వెళ్లిన కుటుంబాల్లో కలవరం
స్వీయ గృహ నిర్బంధంలో 2,590 మంది
తమకేమీ కాదంటూ కొంతమంది జల్సా
ఆందోళన చెందుతున్న స్థానికులు
జగిత్యాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాకు దుబాయ్, ముంబై గుబులు పట్టుకుంది. ఉపాధి నిమిత్తం ఈ ప్రాంతం నుంచి వేల సంఖ్యలోనే గల్ఫ్ దేశాలతో పాటు ముంబైకి వెళ్లినవారు ఉన్నారు. కరోనా భయంతో ఒక్కొక్కరు ఇంటిబాట పడుతుండటంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. గల్ఫ్‌తో పాటు ముంబైకి వెళ్లినవారు ఇప్పటికే 5 వేల మంది స్వగ్రామాలకు చేరుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి 2 వేల మంది, ముంబై నుంచి 3 వేల మంది తమ ఇళ్లకు చేరుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చినవారి నుంచే కరోనా వైరస్ వస్తుండటంతో పాటు ముంబైలోనూ ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో జగిత్యాల జిల్లాకు కొత్త భయం మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2,590 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నట్లు సమాచారం.
గల్ఫ్ నుంచి వచ్చిన వారిలో మరికొందరు తాము పరీక్ష చేయించుకున్నామని, తమకు కరోనా అంటుకోలేదని చెబుతూ తిరుగుతున్నారు. స్నేహితులతో కలిసి జల్సాలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో దాదాపు 20 మందికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఒక్కరికీ పాజిటివ్ రానప్పటికీ ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. ఇంకా చాలా మంది ముంబైలోనే ఉండిపోవడంతో ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు.