తలసానీ.. పహిల్వాన్‌గిరీ బంద్‌జేయ్‌

ABN , First Publish Date - 2020-05-09T10:35:47+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శలు చేస్తూ.. సైనికులు జీతాల కోసం పనిచేస్తారన్న పదం వాడారు. అంటే సరిహద్దుల్లో పని చేసే సైనికులంతా జీతాల కోసమే

తలసానీ.. పహిల్వాన్‌గిరీ బంద్‌జేయ్‌

హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): ‘‘టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శలు చేస్తూ.. సైనికులు జీతాల కోసం పనిచేస్తారన్న పదం వాడారు. అంటే సరిహద్దుల్లో పని చేసే సైనికులంతా జీతాల కోసమే పనిచేస్తున్నట్టా? ఇది దేశం కోసం పనిచేసే సైనికులను అవమానించడమే’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్‌ను, సైనికులను అమమానించినందుకు మంత్రి తలసాని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విహారయాత్రగా దేశ సరిహద్దులకు మంత్రి తలసాని వెళ్లి ఉండొచ్చునని, యుద్ధం కోసం వెళ్లిన చరిత్ర ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్‌, సైనికుల పట్ల మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌.. సింగిల్‌మ్యాన్‌ షో నడుస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలంతా డమ్మీలేనన్నారు.


మొక్కుబడి కేబినెట్‌ సమావేశాలకు హాజరవుతున్న మంత్రులు.. సీఎం మాట్లాడిన దానికి భజన చేసి వెళుతుంటారని, వారికి వ్యక్తిత్వం లేదని విమర్శించారు. ‘‘మంత్రి తలసాని బయట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటరు. సీఎం ముందు మాట్లాడేంత దమ్ము, ధైర్యం ఆయనకు ఉందా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి యుద్ధ విమానాలకు పైలట్‌గా పనిచేశారు. చైనా, పాకిస్థాన్‌ బోర్డర్లలో సేవలందించారు. యుద్ధ విమానం గాలిలో పేలిపోతే పారాచ్యూట్‌ సహాయంతో బయటపడ్డారు. ఆ సమయంలో ఉత్తమ్‌ నడుముకు దెబ్బ కూడా తగిలింది. నోరుంది కదా అని తలసాని ఆయన్ను అవమానించేలా మాట్లాడతారా? దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి’’ అని జగ్గారెడ్డి అన్నారు. చనిపోయిన తర్వాత సైనికులకు సెల్యూట్‌ కొట్టడం కాదని, బతికున్నప్పుడూ గౌరవించాలని చెప్పారు. తలసాని మంత్రిగా కాకుండా పహిల్వాన్‌లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్‌ నేతలను బఫూన్లు, జోకర్లు అంటడు. ఈయన ఎప్పుడు ఎవరిని తిడతడో తెలియదు. చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కేసీఆర్‌ను బట్టలిప్పి కొడతానన్నడు. పిలవగానే వెళ్లి మంత్రి పదవి తీసుకున్నడు. ఇక్కడ బఫూన్లు, జోకర్లు, బ్రోకర్లు ఎవరు? అంత రోషమే ఉంటే కేసీఆర్‌ గుమ్మం కూడా తొక్కి ఉండేవాడు కాదు’’ అన్నారు. ఒకప్పుడు తనను ఎవరెవరు తిట్టారో వారందరినీ టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని కేసీఆర్‌ తన కాళ్ల కింద పెట్టుకున్నారని చెప్పారు. తలసాని తిట్టినందునే ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్‌.. చెప్పుల కింద వేసుకుని నలుపుతున్నాడన్నారు.


‘‘మంత్రి పదవిది ఏముంది? పవరా పాడా? ముందు, వెనుక పోలీసులు, గన్‌మెన్లను చూసి మురుసుడే’’ అంటూ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కేసీఆర్‌ను తిట్టి.. ఇప్పుడు భజన చేసే కార్యక్రమం పెట్టుకున్న తలసానికి సోనియా, రాహుల్‌, ఉత్తమ్‌లను విమర్శించే నైతికత లేదన్నారు. ‘‘తలసానీ నీ పహిల్వాన్‌గిరీ బంద్‌ చేసుకో. ఎవరి ఊరికి వారు పటేల్‌. డైలాగులు బంద్‌ చేయి. కాంగ్రెస్‌ నేతలపై మళ్లీ మళ్లీ మాట్లాడితే గాంధీభవన్‌లో పత్రికా సమావేశం పెట్టి నీ చరిత్ర మొత్తం చెబుతా’’ అంటూ హెచ్చరించారు. ‘‘హైదరాబాద్‌లో మంత్రి పహిల్వాన్‌గిరీ చేయవచ్చు.. ఇక్కడ నేను ఆయన్ను ఏమీ చేయలేకపోవచ్చు, టైం బాగోలేక ఆయన సంగారెడ్డికి వస్తే.. అక్కడ నాది నడుస్తుంది’’ అని అన్నారు. తమ దురదృష్టం ఏంటంటే.. తమ పార్టీలో అంతా చదువుకున్నవారు ఉన్నారని, ఎవరికీ తిట్లు రావని చెప్పారు. చం మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌లూ పాస్‌పోర్టు కేసుల్లో ఉన్నారని, వారినీ లోపల వేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే తామూ అలాగే మాట్లాడతామన్నారు. 


మద్యం షాపులు కాదు.. మసీదులు తెరవండితాను సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వస్తుంటే ఒక్కో వైన్‌ షాపు వద్ద వెయ్యి నుంచి 2 వేల మంది వరకు నిలబడ్డారని, పరిస్థితి లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లుగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. విచ్చలవిడిగా జనాలు తిరిగి.. అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. ‘ముస్లింలు రంజాన్‌ సందర్భంగా రోజాలో ఉంటున్నారు. వారిని మసీదుల్లోకి అనుమతించవచ్చు కదా? వైన్‌ షాపుల వద్ద రాని కరోనా.. మసీదుల్లో వస్తుందా?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ అనే ముచ్చటా లేదు.. టెస్టింగులూ లేవని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-05-09T10:35:47+05:30 IST