ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్ ఇచ్చినట్టున్నారు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-09-14T19:38:36+05:30 IST

తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్వశ్చన్ అవర్‌లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్ ఇచ్చినట్టున్నారు: జగ్గారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులకు టార్గెట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, క్వశ్చన్ అవర్‌లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. జీరో అవర్‌లో కాంగ్రెస్ నుంచి ఒకరికే మాట్లాడే అవకాశం ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ జరిమానాలు బాగా పెరిగాయని, సీఎం ఆదేశాలను అనుసరిస్తూ ట్రాఫిక్ పోలీసులు.. ఆటో రిక్షాలు, ద్విచక్రవాహన దారులకు అధిక జరిమానాలు విధిస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.


ట్రాఫిక్ నిబంధనలు కొద్దిగా అతిక్రమించినా ఎక్కువ ఫైన్‌లు వేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా చలానాలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆటోలు నడుపుకునే వారికి వారు సంపాదించే దాంట్లో సగం డబ్బు చలానాలకే సరిపోతోందన్నారు. చలానా కట్టకపోతే పెనాల్టీలు వేస్తున్నారని, కరోనా కష్ట కాలంలో జరిమానాలు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా అని ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తక్షణమే ట్రాఫిక్ చలానాలను నిలిపివేయాలన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదని ఆయన ఆరోపించారు. రైతుబంధు పేరుతో ఇచ్చిన డబ్బును ఆ రైతు కొడుకు నుంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే ట్రాఫిక్ పోలీసులతో ఈ చలానాలు వేయిస్తున్నారని, కరోనా సమయంలో ఇప్పటి వరకు విధించిన చలానాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-14T19:38:36+05:30 IST