ఒకే గొడుగు కిందకు ఇరిగేషన్
ABN , First Publish Date - 2020-12-29T07:27:03+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది
కొత్తగా 945 పోస్టుల మంజూరు
19 ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తింపు
ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక సీఈ
సీఎం నిర్ణయం.. అర్ధరాత్రి జీవో జారీ
శాఖ పునర్వ్యవస్థీకరణ స్వరూపం ఖరారు..
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరులశాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షిస్తారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.
ఈ మేరకు అర్ధరాత్రి జీవో జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలు ఉంటాయి. ఈ 19 ప్రాదేశిక ప్రాంతాలకు ఒక్కొక్క దానికి ఒక్కో సీఈ(చీఫ్ ఇంజనీర్)ని పర్యవేక్షణాధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆరుగురు ఈఎన్సీ(ఇంజనీర్ ఇన్ చీఫ్) లను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. జనరల్, అడ్మినిరేస్టషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్‌లో బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు పోస్టులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. కాగా, రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని కేసీఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక-కొరాట ప్రాజెక్టు బ్యారేజి, పంప్ హౌస్, కాలువలను 2021 జూన్ లోగా పూర్తి చేయాలి.
- చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలి.
- ఆదిలాబాద్ జిల్లాలో కుప్ప్టి, మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలి. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులు వచ్చే వానాకాలంలోపు పూర్తి కావాలి
- వర్థన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు. పరకాల నియోజకవర్గంలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులు పూర్తిచేయాలి. అచ్చంపేట ఎత్తిపోతలకు వెంటనే సర్వే నిర్వహించాలి.
- హుజూర్ నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
పోస్టుల వివరాలిలా..
పోస్టు ప్రస్తుత సంఖ్య పెరిగేవి మొత్తం
సీఈ 19 3 22
ఎస్‌ఈ 47 10 57
ఈఈ 206 28 234
డీఈఈ 678 214 892
ఏఈఈ 2436 360 2796
టెక్నికల్ ఆఫీసర్లు 129 70 199
అసిస్టెంట్ 173 69 242
టెక్నికల్ ఆఫీసర్లు
జూనియర్ 346 52 398
టెక్నికల్ ఆఫీసర్లు
నాన్ టెక్నికల్ 31 14 45
పర్సనల్ అసిస్టెంట్లు
సూపరింటెండెంట్లు 187 51 238
రికార్డు అసిస్టెంట్లు 134 71 205