వైరస్సునామి.. నిర్లక్ష్యమేమి!

ABN , First Publish Date - 2020-10-04T08:11:06+05:30 IST

హైదరాబాద్‌లో కరోనా తీవ్రతలో పెద్దగా మార్పులేదు. రోజూ ఎన్నో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

వైరస్సునామి.. నిర్లక్ష్యమేమి!

కరోనాపై ప్రజల్లో కనిపించని ఆందోళన..

మాస్కులు లేకుండా నిర్భీతిగా రోడ్లపైకి 

భౌతిక దూరానికీ చెల్లుచీటి.. పెరిగిన ట్రాఫిక్‌ 

పనిలేకున్నా గుమిగూడుతున్న జనం 

టీ కొట్లు, టిఫిన్‌ సెంటర్ల దగ్గర చేరి కబుర్లు 

సాధారణ పరిస్థితులను తలపిస్తున్న నగరం 

12 రోజుల్లో తెరుచుకోనున్న థియేటర్లు

జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే


హైదరాబాద్‌ సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కరోనా తీవ్రతలో పెద్దగా మార్పులేదు. రోజూ ఎన్నో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రజల్లోనే మార్పు వచ్చింది. వైరస్‌ పట్ల వారిలో మునుపటి భయం లేదు. ఇంటి గడప దాటితే మాస్కు ధరించే జనాలు, ఇప్పుడు మాస్కు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా రోడ్ల పక్కన టీ కొట్లు, టిఫిన్‌ సెంటర్లు, షాపుల వద్ద నిల్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు. రోడ్లపైనా వాహనాల రద్దీ పెరిగింది. రైతుబజార్లు, రెస్టారెంట్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. షాపులు, బస్టాపుల్లో దగ్గర దగ్గరగా కూర్చుంటున్నారు. తమ దైనందిన కార్యకలాపాల్లో ప్రజలు, సాధారణ రోజుల్లో మాదిరి వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరి కొద్దిరోజుల్లో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనే సంఖ్యపైనా పరిమితులనూ సడలించనున్నారు. మరి.. కరోనా విషయంలో ప్రజల్లో ఇప్పటికే కమ్ముకున్న నిర్లక్ష్యపు ధోరణి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నిబంధనల సడలింపులతో జనం ఇంకా రోడ్లపైకి వస్తే అది మరింత ప్రమాదకరమే.



ఈ మేరకు ప్రజలు, కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తున్నారా? మాస్కులు ధరిస్తున్నారా? భౌతిక దూరం పాటిస్తున్నారా? అనే విషయాలను నగరంలో వివిధ ప్రాంతాల్లో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. అన్నిచోట్లా సాధారణ రోజుల్లో మాదిరి పరిస్థితులే కనిపించాయి. వ్యాపార, వ్యాణిజ్య సంస్థలు మొదలు ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు మునుపటి మాదిరిగానే కొనసాగుతున్నాయి. చంపాపేట, కర్మాన్‌ఘాట్‌ చౌరస్తాల్లోని రహదారులపై వాహనదారులు మాస్కులు లేకుండనే వెళ్లడం కనిపించింది. పాతబస్తీలోని మాదన్నపేట మండీలో కరోనా నిబంధనలు పాటించడం లేదు. మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో పాటు వినియోగదారులు మాస్క్‌లు ధరించకుండా కనిపించారు. మీర్‌పేట్‌ రైతు బజార్‌లో భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతున్నారు. బాలాపూర్‌ చౌరస్తా, మీర్‌పేట్‌ చౌరస్తా, మంద మల్లమ్మ చౌరస్తా, గాయత్రీనగర్‌ తదితర ప్రధాన చౌరస్తాల్లో రద్దీ బాగా పెరిగింది. ఎల్‌బీనగర్‌ రింగ్‌ రోడ్డులో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య   1800 కార్లు, దాదాపు 2400 బైకులు ప్రయాణించాయి. కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌లో శానిటైజ్‌ చేయకుండానే టెంపరేచర్‌ చెక్‌ చేసి స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు.



ఆర్టీసీ బస్సుల్లో కొన్నిచోట్ల సీట్లు నిండిపోయి పరిమితికి మించి జనాలు నిలబడి ప్రయాణిస్తున్నారు.   కేపీహెచ్‌బీ నుంచి ఎల్బీనగర్‌ దాకా రద్దీ  ఉండటంతో   సీట్లలో దగ్గరదగ్గరగా కూర్చున్నారు. 


పెట్రోలు బంకుల వద్దకు వచ్చే వాహనదారుల్లో కొందరు మాస్కులు ధరించడం లేదు. ఓ చోట  గంట వ్యవధిలో వందకుపైగా వాహనాలు, ఇంధనం కోసం బంకుల వద్దకు వచ్చాయి. అప్పటిదాకా మాస్కులు ధరించని వాహనదారులు, బంక్‌ వద్దకు రాగానే తప్పదనట్లుగా మాస్కులు దరించారు.  


బేగంపేట, అమీర్‌పేట, బల్కంపేట ప్రాంతాల్లోని టీ స్టాల్స్‌ వద్దకు వచ్చే వారిలో 60శాతం మంది మాస్కులు వాడటం లేదు. చాయ్‌ సప్లయి చేసే మాస్టర్‌ సైతం మాస్క్‌ పెట్టుకోవడం లేదు.  


బైక్‌లపై వెళ్లే వారిలో చాలామంది మాస్క్‌లు ధరించడం లేదు. కార్లలో ఐదారుగురు చొప్పున ప్రయాణిస్తున్నారు. వాహనాల్లో పక్క పక్కన కూర్చున్నా మాస్కు ధరించడం లేదు. 


ప్రయాణికులకు నిబంధనలు చెబుతున్నాం ..అల్వాల్‌రెడ్డి, ఆర్‌టీసీ డ్రైవర్‌, హయత్‌నగర్‌ 

ఆర్‌టీసీ బస్సులు 25 శాతమే తిప్పుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రయాణికులేమీ ఎక్కటం లేదు. ఉద్యోగ వేళలు కావడంతో ఉదయం, సాయంత్రాల్లో రద్దీ ఉంటోంది. అయితే ఎక్కువ బస్సుల్లో సగం నిండిన సీట్లతోనే రాకపోకలు సాగిస్తున్నాయి.  ఫేస్‌ మాస్కులు వాడాలని, భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు సూచిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప, అందరూ ఫేస్‌  మాస్కులతోనే బస్సులు ఎక్కుతున్నారు.  

Updated Date - 2020-10-04T08:11:06+05:30 IST