మత్తులో యువత చిత్తు!

ABN , First Publish Date - 2020-09-13T07:31:59+05:30 IST

హైదరాబాద్‌ శివార్లలో మూత పడ్డ ఫార్మా కంపెనీలు కూడా డ్రగ్స్‌ ముఠాలకు అడ్డాలుగా మారాయి.

మత్తులో యువత చిత్తు!

పెరిగిపోతున్న డ్రగ్స్‌ కల్చర్‌..

చిత్ర పరిశ్రమ, ఐటీ సెక్టార్‌ దాసోహం!


హైదరాబాద్‌ శివార్లలో మూత పడ్డ ఫార్మా కంపెనీలు కూడా డ్రగ్స్‌ ముఠాలకు అడ్డాలుగా మారాయి. జీడిమెట్ల, హయత్‌నగర్‌, చర్లపల్లి, నాచారం ప్రాంతాల్లో డ్రగ్స్‌ తయారీ కేంద్రాల గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), ఎక్సైజ్‌, స్థానిక పోలీసులు రట్టు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆగస్టులో కూడా మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్న కంపెనీలపై డీఆర్‌ఐ అధికారులు వరసదాడులు చేశారు. రూ. 100 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. 


ఒకప్పుడు బడా బాబులకే పరిమితం

ఇప్పుడు స్కూలు విద్యార్థులూ బానిసలే

నగర శివార్లలో ‘లోకల్‌’ డ్రగ్స్‌ తయారీ

గంజాయి నుంచి కొకైన్‌, చరాస్‌ దాకా

అన్నింటికీ హైదరాబాద్‌ అడ్డా?

దేశంలోనే మూడో స్థానంలో రాజధాని

గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ పార్టీలు

రియా ఉదంతంతో కలకలం

డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలపై విచారణ: బీజేపీ

రాష్ట్రం స్పందించకుంటే కేంద్రానికి లేఖ 

రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ కలకలం మళ్లీ మొదలైంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతికేసు ఎన్నో మలుపులు తిరిగి.. చిత్రపరిశ్రమలో డ్రగ్స్‌ కల్లోలాన్ని రేపింది. రియా చక్రవర్తి అరెస్టు తర్వాత పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.


అటు శాండల్‌వుడ్‌లోనూ రాగిణి, సంజన డ్రగ్స్‌ కేసుల్లో అరెస్టయ్యారు. రియా వాంగ్మూలంలో టాలీవుడ్‌ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో.. రాష్ట్రంలోనూ మాదక ద్రవ్యాల కేసులు రోజూ వెలుగు చూస్తున్నాయి.


ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే లభ్యమయ్యే ఖరీదైన ‘మత్తు’గా ఉన్న డ్రగ్స్‌.. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ఐటీసెక్టార్‌ మొదలు.. మధ్యతరగతి ప్రజలు, చివరికి స్కూలు విద్యార్థులనూ ఉచ్చులోకి లాగుతోంది. నైజీరియా లాంటి ఆఫ్రికాదేశాలు, ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే కొకైన్‌, చరాస్‌ మత్తుపదార్థాలు ఇప్పుడు లోకల్‌గానే లభిస్తున్నాయి. గోవా, జమ్మూకశ్మీర్‌ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఖరీదైన డ్రగ్స్‌ చేరుతున్నాయి.


పదిహేనేళ్ల క్రితం వరకు చిన్నాచితకా గంజాయి కేసులు నమోదయ్యే హైదరాబాద్‌లో ఇప్పుడు ఎండీఎంఏ బ్లోట్స్‌ కేసులూ రిజిస్టర్‌ అవుతున్నాయి. తొలినాళ్లలో డగ్స్‌ కేసంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు స్థానికులే డ్రగ్స్‌ తయారు చేస్తున్నారు.. దిగుమతి చేసుకుంటున్నారు.. అమ్ముతున్నారు.. వాడుతున్నారు.డ్రగ్స్‌ వినియోగంలో గోవా, ఢిల్లీ నగరాల తర్వాత.. హైదరాబాద్‌ మూడో స్థానానికి చేరుకుంది.


మూడేళ్ల క్రితం కెల్విన్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్టు తర్వాత.. పెద్ద సంఖ్యలో సినీ నటులను ఎక్సైజ్‌ పోలీసులు విచారించారు. అయితే ఆ కేసులో సినీ ప్రముఖులను బాధితులుగానే పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో, ఐటీ సెక్టార్‌లో, చివరికి మధ్యతరగతి, స్కూలు విద్యార్థుల పార్టీల్లో కూడా డ్రగ్స్‌ భాగమవుతున్నాయి. పండుగలు, పుట్టినరోజు పర్వదినాలు, ఈవెంట్లు, కొత్త సంవత్సర వేడుకలు, పబ్‌లు, కాలేజ్‌ పార్టీలు, బార్‌లు, రిసార్టులు, ఫామ్‌హౌ్‌సలలో జరిగే పార్టీల్లో డ్రగ్స్‌ ప్రధాన భూమిక పోషిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పార్టీల్లో డ్రగ్స్‌ ఇప్పుడు నయా ట్రెండ్‌ అని తెలుస్తోంది.


ఖరీదైన డ్రగ్స్‌ అన్నీ గోవా, జమ్మూకశ్మీర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాయి. డ్రగ్స్‌కు అలవాటు పడి కొందరు.. అధిక సంపాదన కోసం మరికొందరు గోవా నుంచి మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి కొకైన్‌, హెరాయిన్‌, చరాస్‌, ఎండీఎంఏ బ్లోట్స్‌, ఓపియం, ఎఫెడ్రోన్‌, ఎల్‌ఎ్‌సఏ స్ట్రిప్స్‌, ఎల్‌ఎ్‌సడీ బ్లోట్స్‌ నగరానికి వస్తున్నాయి. దీంతో ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్‌.. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులకూ అందుబాటులో ఉంటున్నాయి.
ఇక్కడే తయారీ.. ఏడు దేశాలకు ఎగుమతి?

హైదరాబాద్‌ శివార్లలో మూత పడ్డ ఫార్మా కంపెనీలు కూడా డ్రగ్స్‌ ముఠాలకు అడ్డాలుగా మారాయి. జీడిమెట్ల, హయాత్‌నగర్‌, చర్లపల్లి, నాచారం ప్రాంతాల్లో డ్రగ్స్‌ తయారీ కేంద్రాల గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), ఎక్సైజ్‌, స్థానిక పోలీసులు రట్టు చేసిన దాఖలాలున్నాయి.


2014లో చర్లపల్లిలో సురేశ్‌ అనే డీసీఎం డ్రైవర్‌ ఏకంగా ‘సెక్స్‌డ్రగ్‌’ను తయారు చేశాడు. ఇంటర్‌ మాత్రమే చదివిన సురేశ్‌ ఫార్మా గుట్టును తెలుసుకుని, ఈ డ్రగ్‌ను సొంతంగా తయారు చేశాడు. ఆ డ్రగ్‌ మత్తును ఇవ్వడంతోపాటు.. ఎలాంటి వారినైనా లైంగికంగా ఉత్తేజపరుస్తుంది. దీన్ని అతడు ఏకంగా ఏడు దేశాలకు ఎగుమతి చేయడం గమనార్హం.


ఆగస్టులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న కంపెనీలపై డీఆర్‌ఐ అధికారులు వరసదాడులు చేసి రూ.100 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం డ్రగ్స్‌ ముఠాలు వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని విదేశాలకూ ఎగుమతి చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు తేల్చారు.
దర్యాప్తు ఎక్కడ: ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

మూడేళ్ల క్రితం సెలబ్రిటీలు, రాజకీయ నేతలను గడగడలాడించిన డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమకు చెందిన వారికి క్లీన్‌చిట్‌ లభించడంతో ఈ కేసు ముందుకు సాగలేదు. డ్రగ్స్‌ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని ఎక్సైజ్‌ విభాగానికి చెందిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌  కార్యదర్శి పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు.


సినీ ప్రముఖులను బాధితులుగా పేర్కొవడంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారు. 12 కేసులు పెట్టిన సిట్‌.. 62 మంది సాక్షులను విచారించింది. అయితే.. అప్పట్లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి సినీ పరిశ్రమకు చెందిన వారిని అరెస్టు చేయరాదని కోరడం వల్లే.. వారిని బాధితులుగా చేర్చారని, కేసు నీరుగారిపోయిందని పద్మనాభరెడ్డి ఆరోపించారు.


విచారణ జరపాలి: బీజేపీ డిమాండ్‌ 

బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తితో పాటు డ్రగ్స్‌ మాఫియాతో తెలుగు సినిమా పరిశ్రమకు చెందినవారికి ఉన్న సంబంధాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు డిమాండ్‌ చేశారు.  ఎంతోమంది విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో, ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ కంట్రోల్‌  బ్యూరో) ద్వారా విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ  రాస్తామన్నారు. 


మత్తు పదార్థం.. వివరణ

కొకైన్‌: కోకా మొక్క నుంచి తయారు చేస్తారు. తెల్లని పౌడర్‌ రూపంలో ఉంటుంది.

ఓపియం: గసగసాల మొక్క నుంచి తయారు చేస్తారు. దీన్నే నల్లమందు అని పిలుస్తారు

హెరాయిన్‌: ఇది కూడా కొకైన్‌ మాదిరిగా ఉంటుంది. మెదడు, గుండెపై ప్రభావాన్ని చూపుతుంది

ఎల్‌ఎ్‌సడీ: దీన్ని లైసర్జిక్‌ యాసిడ్‌ డైథైలామైడ్‌ అంటారు. బ్లోట్స్‌, స్ట్రిప్స్‌ రూపంలో లభిస్తుంది.

ఎండీఎంఏ: మిథైల్‌ ఎనిడియోక్సీ మెథాంఫేటమిన్‌ అని అంటారు. ఇది కూడా బ్లోట్స్‌ రూపంలో లభిస్తుంది.


చాలా మందే ఉన్నారు

చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది డ్రగ్స్‌ తీసుకుంటారు. అయితే వారందరికీ మాదక ద్రవ్యాల వ్యసనం లేదు. పరిశ్రమలో చాలా మంది పరిస్థితుల ప్రభావంతో డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారన్నారు. ఎందుకు ట్రై చేయకూడదనే ఉద్దేశంతో డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. డ్రగ్స్‌ వల్ల యాక్టివ్‌గా ఉంటామని అనుకుంటారు.

- సినీనటి పాయల్‌ ఘోష్‌


ముందుగానే గుర్తిస్తే కాపాడవచ్చు

తమ పిల్లలు చెడువ్యసనాల బారిన పడరనే అతివిశ్వాసాన్ని తల్లిదండ్రులు ప్రదర్శించకూడదు. అనుమానం వస్తే.. కొట్టడం, తిట్టడం, నిలదీయడం చేయకూడదు. ప్రొఫెషనల్స్‌ సహాయం తీసుకోవాలి. డ్రగ్స్‌ తీసుకునేవారి ప్రవర్తనలో క్రమంగా మార్పులు వస్తాయి. ముందుగానే గమనిస్తే.. డీ-ఎడిక్షన్‌ సెంటర్ల సాయం తీసుకోవచ్చు. వారిని కాపాడవచ్చు.  

- డాక్టర్‌ ఐ.భరత్‌కుమార్‌ రెడ్డి, 

సీనియర్‌ సైక్రియాటిస్ట్‌, అపోలో ఆస్పత్రితల్లిదండ్రులు, టీచర్లే గుర్తించాలి


మా దగ్గరకు వచ్చే కేసుల్లో ఎక్కువగా మద్యానికి బానిసవ్వడం, గంజాయి, నిద్రమాత్రలు, దగ్గు మందు సేవించడం వంటివే ఉంటున్నాయి. స్కూలు పిల్లలు ఎక్కువగా సాల్వెంట్లు, ఫెవీబాండ్స్‌, వైట్‌నర్‌లకు బానిసవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లే వారిని కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్‌ తీసుకునేవారి ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. క్లాసులు ఎగ్గొట్టడం, పనితీరులో తేడాలు, ఊరికే చికాకు పడుతుండడం, ఇంట్లో అబద్ధాలు చెబుతూ డబ్బులు తీసుకోవడం, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే.. వారి చేతికి డబ్బు అందగానే హుశారుగా మారిపోతారు.

- డాక్టర్‌ రమణ చెరుకూరి, 

సైక్రియాట్రిస్ట్‌, ఆశా ఆస్పత్రి
రియా ఉదంతంతో.. టాలీవుడ్‌లో కలకలం!


సినీ జగత్తు గ‘మత్తు’ కోసం పాకులాడుతోంది. 1980 కాలం నుంచే సినీ ప్రపంచంలో డగ్స్‌ కలకలం ఉన్నా.. ఇప్పుడది ‘తారా’స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా కొత్తగా సినీరంగానికి పరిచయమవుతున్న వారు.. తమకూ పెద్ద పరిచయాలున్నాయని చాటుకునేందుకు ‘మత్తు’ ఉచ్చులోకి దిగుతున్నారు. క్రమంగా దానికి బానిసై.. సినిమాలు లేక, ఆర్థిక పరిస్థితి దిగజారి, మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే శక్తి లేక.. ‘మత్తు’ను వీడి ఉండలేక.. సరఫరాదారులుగా మారుతున్నారు.


సినీ పరిశ్రమ అంటేనే వైకుంఠపాళి లాంటిదని.. ఎప్పుడు అందలం ఎక్కుతారో.. ఎప్పుడు అథఃపాతాళానికి వెళ్తారో తెలియదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది డ్రగ్స్‌కు బానిసలువుతున్నారని తెలిపారు. డ్రగ్స్‌ను ఓ రిక్రియేషన్‌గా మొదలు పెడతారని, క్రమంగా బానిసవుతారని పేర్కొంటున్నారు. తర్వాత వారే డ్రగ్స్‌ సప్లయర్లుగా మారుతారని.. రియా చక్రవర్తి ఉదంతమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.రాజధానిలో గ్రాము ధర  ఇలా 


మత్తు పదార్థం ధర (రూపాయల్లో)

కొకైన్‌ 3,0004,000

ఓపియం 2,0003,000

హెరాయిన్‌  2,0003,000

ఎల్‌ఎ్‌సడీ 1,5003,000

ఎండీఎంఏ 4,0006,000


హైదరాబాద్‌లో అరెస్టులు ఇలా


సంవత్సరం అరెస్టులు విదేశీయులు

2015         66                   10

2016        154                     8

2017        273                     21

2018       104                   10

2019      196                  1


Updated Date - 2020-09-13T07:31:59+05:30 IST