ఇంతింతై.. వటుడింతై.. కమల వికాసం!
ABN , First Publish Date - 2020-12-05T09:16:09+05:30 IST
ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా కమలం విజయ పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక

‘గ్రేటర్’లో కారు స్పీడ్‌కు బ్రేకులు వేసిన బీజేపీ
ఓట్లు, సీట్ల శాతంలో గణనీయంగా పెరుగుదల
టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం దిశగా మలి అడుగు
హైదరాబాద్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా కమలం విజయ పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినప్పటికీ, ఆరేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో పెద్దగా రాణించలేకపోయిన బీజేపీ.. సంస్థాగత మార్పులు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే ఊహించని విధంగా పుంజుకుంది. నిన్న దుబ్బాకలో మోగించిన విజయదుందుభిని గ్రేటర్ హైదరాబాద్‌కూ విస్తరించింది.
రాష్ట్ర రాజధానిలో కీలక ప్రాంతాల్లో పట్టు సాధించి, పాగా వేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా అత్యధిక డివిజన్లు గెలిచి సత్తా చాటింది. పలుచోట్ల కారు స్పీడుకు బ్రేకులు వేసిన కమలం.. మరి కొన్ని చోట్ల ముచ్చెమటలు పట్టించింది. చాలా డివిజన్లలో నువ్వా? నేనా? అన్న స్థాయిలో పోటీ ఇచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 61 డివిజన్లలో పోటీ చేసి నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఈ సారి ఈసారి ఒంటరిగా బరిలోకి దిగి సీట్లు, ఓట్ల పరంగా తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. అంతేకాదు.. చాలా స్థానాల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామే అన్న వాదనను నిలబెట్టుకోవడమే కాదు.. ఒక రకంగా చెప్పాలంటే చుక్కలు చూపించింది.
2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ.. ఒక ఎంపీ, ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటునే గెలుచుకుని ఏకంగా 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 4 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిలబడిన కమలం.. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించింది. అదే ఊపును గ్రేటర్ ఎన్నికల్లో కొనసాగించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పార్టీ జాతీయ నాయకత్వం తరలివచ్చి ప్రచారం చేయగా, రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మక కార్యాచరణతో చెమటోడ్చి.. తగిన ఫలితాన్ని రాబట్టింది. గతంలో కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట, రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ సెగ్మెంట్లలో పార్టీ పట్టు నిలుపుకొంది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, పటాన్చెరు, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోయినా.. జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు పెంచుకుంది. పాతబస్తీలో చెప్పుకోదగ్గస్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయినా మజ్లి్‌సకు గట్టి పోటీ ఇచ్చింది.
‘‘టీఆర్ఎస్, మజ్లి్‌సకు సీట్ల సంఖ్య తగ్గినా ఎక్స్ అఫిషియో ఓట్ల దృష్ట్యా, మేయర్ పదవి మాకు కష్టమని తెలుసు. అయితే.. ఈ విజయంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం వచ్చింది. మా లక్ష్యం కూడా ఇదే. 25-30 వస్తే వచ్చే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రూట్‌మ్యాప్ సిద్ధమైనట్లే. 30 దాటితే ఇక తిరుగుండదని అంచనా వేశాం. ఇప్పుడు అంతకుమించి విజయం సాధించాం’’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు వివరించారు.
భూపేంద్రయాదవ్ కార్యాచరణ
గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం సీనియర్ నేత భూపేంద్రయాదవ్‌ను రంగంలోకి దింపింది. ఎన్నికల షెడ్యూలుకు ముందే హైదరాబాద్ చేరుకున్న ఆయన.. కార్యాచరణ మొదలుపెట్టారు. తన వ్యూహ చతురతతో ఇతర పార్టీలోని అసంతృప్తులను తమవైపునకు తిప్పుకొన్నారు. సీనియర్ నేతలు, అనుభవజ్ఞుల సేవలను సమయోచితంగా వినియోగించుకోవడం, ప్రత్యర్థి పార్టీల విమర్శలపై క్షణాల్లో స్పందించడం వంటి అంతర్గత కార్యాచరణ పక్కా ఫలితాన్ని ఇచ్చిందని కమలం నాయకులు పేర్కొంటున్నారు.