సేవ.. సంతోషం.. సంతృప్తి

ABN , First Publish Date - 2020-09-21T06:25:23+05:30 IST

సామాజిక మాధ్యమాల (సోషల్‌ మీడియా) ద్వారా తన ప్రజా జీవితంలో సేవ, సంతోషం,సంతృప్తి ఏకకాలంలో సాకారమయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌

సేవ.. సంతోషం.. సంతృప్తి

సోషల్‌ మీడియాతో ఏకకాలంలో సాకారం

కరోనా సమయంలో మనుషులు దూరంగా 

ఉన్నా.. మనసులను కలిపింది ఈ మాధ్యమమే

సానుకూలంగా వాడుకుంటేనే సత్ఫలితాలు

వినోదం కోసమైతే పరిమితులు తప్పనిసరి

దుర్వినియోగాన్ని అరికట్టడానికి కఠిన చట్టాలు అవసరం

మారుమూల ప్రాంతాలకూ సాంకేతికత విస్తరించాలి

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ‘ట్విటర్‌ మిలియనీర్‌’ కె.కవిత


 ‘సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌’

సోషల్‌ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమాల్లో సంతృప్తినిచ్చిన వాటిలో ‘సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌’ కూడా ఒకటి. రాఖీ పండుగ నాడు ప్రతి మహిళ తన సోదరులకు రాఖీ కట్టడంతోపాటు, ఒక హెల్మెట్‌ను బహూకరించాలని నేను ఇచ్చిన పిలుపునకు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. ఈ పిలుపునకు వివిధ రంగాల ప్రముఖులు ఎంతో మంది బాసటగా నిలవటం ఆనందం కలిగించింది.



హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల (సోషల్‌ మీడియా) ద్వారా తన ప్రజా జీవితంలో సేవ, సంతోషం,సంతృప్తి ఏకకాలంలో సాకారమయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ‘‘అవసరాన్ని తెలియజేస్తూ మెసేజ్‌ చేసిన వారికి సేవ చేసే అవకాశం దొరికింది. దాంతో అవసరం తీరిన వారికి సంతోషం కలిగింది. నాకు సంతృప్తి మిగిలింది’’ అని పేర్కొన్నారు. అయితే నాణేనికి బొమ్మాబొరుసు ఉన్నట్లుగానే, సోషల్‌ మీడియా వాడకానికి సంబంధించి మంచీచెడు రెండూ ఉంటాయని, ఎటువైపు వెళ్తామనేది మన విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్‌లో తన అకౌంట్‌ను 10 లక్షల (ఒక మిలియన్‌) మంది అనుసరించిన అరుదైన మైలురాయిని చేరుకున్న కవిత ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలు, అధికారులు, ప్రభుత్వాల మధ్య సోషల్‌ మీడియా వారధిగా ఉపయోగపడుతోందని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. దీనివల్ల పారదర్శక పాలన అందించే వీలు కలుగుతుందన్నారు. కరోనా సమయంలో మనుషులు దూరంగా ఉన్నప్పటికీ, మనుసులను కలిపిన ఘనత సోషల్‌ మీడియాకే దక్కిందన్నారు. కవిత ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.


దక్షిణాది నుంచి ట్విటర్‌లో మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్న తొలి మహిళ మీరు? ఎలా ఫీలవుతున్నారు ?

సంతోషంగా ఉంది. దక్షిణాది నుంచి జాతీయ పార్టీలకు చెందిన మహిళా నేతలు ఉన్నప్పటికీ, ఒక ప్రాంతీ య పార్టీ నాయకురాలిగా నన్ను ట్విటర్‌లో పది లక్షల మంది అనుసరించటాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నా. 


ట్విటర్‌లో ఎప్పుడు అడుగు పెట్టారు ?

ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చుకోవటానికి, వారికి సాయపడే పరిస్థితిని సృష్టించుకోవటానికి సోషల్‌ మీడియాలో అడుగుపెట్టా. 2013 నుంచి ట్విటర్‌లో చురుగ్గా ఉంటున్నా. తర్వాత ఎంపీ అయ్యాక అనేక సందర్భాల్లో విదేశాలకు వెళ్లినప్పుడు, పార్లమెంటులో మాట్లాడినప్పుడు, ప్రజలకు ఉండే సమస్యల పరిష్కారానికి, వారి అభ్యర్థనలపై స్పందించటానికి, తాజాగా కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండేవాళ్లను కలపటానికి ట్విటర్‌పైనే ఆధారపడ్డాను.


10 లక్షల మంది ఫాలో కావటానికి కారణం ఏమిటి 

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై ఉన్న అభిమానమే కాకుండా, పార్టీ నాయకురాలిగా నేను ఏం చేస్తున్నానని పరిశీలించే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. అది ప్రధాన కారణం అనుకుంటున్నా. అలాగే ట్విటర్‌ అకౌంట్‌లో వచ్చే రిక్వె్‌స్టల ఫాలోఅప్‌ మనస్ఫూర్తిగా చేయటం, వాళ్లిచ్చిన ఫోన్‌ నంబర్లకు నేను లేదా మా ఆఫీస్‌ స్టాఫ్‌ టచ్‌లో ఉండి, సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రయత్నించటం మరొక కారణం.


తీపి, చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ?

అనుకోకుండా, సరదాగా పెట్టినటువంటి ట్వీట్స్‌పై కూడా కొంతమంది వ్యక్తిగతంగా దూషణలు చేస్తుంటారు. ఇది మహిళలకు ఉండే ఇబ్బంది. ఈ రకమైన స్పందన వచ్చినప్పుడు బాధనిపిస్తుంది. మరోవైపు ఎంతోమంది ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. గుడ్‌ మార్నింగ్‌ చెబుతుంటారు. వాళ్ల ఇళ్లల్లో ఏ కార్యక్రమం జరిగినా ఫొటోలను మనతో షేర్‌ చేసుకుంటారు. దీనివల్ల పరోక్షంగా మనమంతా ఒక కుటుంబం అనే భావన వస్తుంది. వాళ్ల దైనందిన జీవితంలో మనం ఒక భాగమైనందుకు సంతోషంగా అనిపిస్తుంది. 


ఎవరికైనా మేలు చేసే అవకాశం లభించిందా ? 

చాలా మందికి దగ్గరవ్వగలిగాం. మాకు వీలైనంత సాయం చేసే ఆస్కారం వచ్చింది. ఏ ఊరిలోనైనా ఏ దేశంలోనైనా టీఆర్‌ఎస్‌, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఉన్నారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని వారి ద్వారా చాలా మందికి మేలు చేయగలిగాం. 


సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటం వల్ల రాజకీయంగాప్రయోజనం ఏమైనా కలిగిందా?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు ఏ అంశంపై మాట్లాడుతున్నారు? ఏ దేశంలో కొత్తగా ఏ చట్టాలు వస్తున్నాయి? మన రాష్ట్రంలో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమున్నాయి? అనేది తెలుసుకునే వీలు కలిగింది. రాజకీయాల్లో ఉండాలనుకునే వాళ్లకు సోషల్‌ మీడియాలో చాలా పాజిటివ్‌ అంశాలున్నాయి.


పాలనలో సోషల్‌ మీడియా పాత్ర ఏంటి?

రాష్ట్రంలో సోషల్‌ మీడియా అనేది సామాన్యుడికి, అధికారులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంది. ప్రభుత్వంలో బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వారు సోషల్‌ మీడియాను వాడటం వల్ల మధ్యలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి, ప్రజలకు మేలు కలుగుతోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంతోపాటు, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల అధికారులు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటం వల్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కకుండానే సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. పారదర్శక పాలన అందించటానికి సోషల్‌ మీడియా దోహదపడుతోంది. 


సోషల్‌ మీడియా విషయంలో మీరిచ్చే సలహాలు?

డేటా స్పీడ్‌, కనెక్టివిటీ పెంచుకోవాలి. ఆదిలాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచుకుంటే చాలా సమస్యలు తీర్చగలుగుతాం. ఉద్యోగులు, పోలీసులు, ప్రభుత్వానికి పని సులువు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ మీద కొత్త చట్టాలు ఎక్కువగా లేవు. సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టటానికి మన దేశంలో, రాష్ట్రంలో కఠినమైన చట్టాలు రావాల్సి ఉంది. మహిళలను వేధించే చర్యలను నిలువరించేలా చట్టాల్లో ప్రాధాన్యం ఉండాలి.

 

యువతకు మీరు ఇచ్చే సందేశం ?

సామాజిక మాధ్యమాల్లో రెండు రకాలుంటాయి. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్‌. అది ఎంత లోతుకు వెళితే, అంత లోతుకు లాక్కెళుతుంది. మనకు సంబంధంలేని అంశాలపై మనల్ని ఒక ఊబిలోకి దించే అంశాలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంటాయి. ఎటువైపు వెళ్తాం అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సోషల్‌ మీడియాను మంచికి వాడుకుంటే, పది మందికి సాయం చేయగలుగుతాం.  ఒకవేళ సోషల్‌ మీడియాను..‘ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే వాడుతా’..అంటే కూడా,  ఒక పరిమితి మేరకు వాడితే మంచిది. 


ముందుగా నోటిఫికేషన్లు బంద్‌ చేస్తా

సోషల్‌ మీడియాకూ ఓ టైం పెట్టుకోవాలి. నేను ముందుగా నోటిఫికేషన్లు బంద్‌ చేస్తా. లేకపోతే టింగ్‌..టింగ్‌ అని క్షణానికో నోటిఫికేషన్‌ వస్తుంది. అందుకే నేను ఒక టైం పెట్టుకొని, ఆ టైంలోనే చూసుకుంటా. దాంట్లో వచ్చిన రిక్వె్‌స్టలను పరిశీలించి కార్యాచరణకు దిగితేనే పనికి వస్తుంది. 


నాకు డైరెక్ట్‌ మెసేజ్‌ ఆప్షన్‌లోనే ఎక్కువ రిక్వె్‌స్టలు

నా ఖాతాలో బయటికి కనిపించే మెసేజ్‌ల కంటే, డైరెక్ట్‌ మెసేజ్‌ ద్వారా వచ్చే రిక్వెస్ట్‌లే ఎక్కువ. పబ్లిక్‌గా చెప్పుకోలేని సమస్యలు డైరెక్ట్‌ మెసేజ్‌ ఆప్షన్‌ ద్వారా పంపిస్తున్నారు. మేం వాటికి స్పందిస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా మెసేజ్‌ పెట్టటం వల్ల బయటికి వెల్లడించటంలేదు. అటువంటి వారికి సాయం చేసిన తృప్తి మాటల్లో చెప్పలేను.

 

గంటలో ఇంటికి సరుకులు

కరోనా సమయంలో ఎక్కడో  అమెరికా, బ్రిటన్‌లలో  ఉన్న వారు కూడా..‘ఇప్పుడు మేం డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం..మాకు ఇంటి సరుకులు లేవు’ అని మెసేజ్‌ పెడితే, అక్కడి జాగృతి కార్యకర్తలకు చెప్పాం. వాళ్లు గంటలో సరుకులు ఇచ్చి వచ్చారు. సోషల్‌ మీడియాలో ఒక్క మెసేజ్‌ ద్వారా ఒక మనిషి కష్టాన్ని..ఆ పూటకు తీర్చగలిగాం.


‘మిలియనీర్‌’ కవిత

ట్విటర్‌లో 10 లక్షల మంది ఫాలోయర్స్‌తో మాజీ ఎంపీ రికార్డు

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత ‘మిలియనీర్‌’ అయ్యారు. సామాజిక మాధ్యమం..ట్విటర్‌లోని తన అకౌంట్‌ను 10 లక్షల మంది అనుసరించటం ద్వారా ఆమె ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. దక్షిణాది నుంచి ట్విటర్‌లో ఒక మిలియన్‌ మంది ఫాలోయర్స్‌ ఉన్న తొలి మహిళా నాయకురాలు కవిత కావటం విశేషం. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనయ కవిత తర్వాత దక్షిణాది నుంచి అత్యధిక ఫాలోయర్స్‌ కలిగిన మహిళా నేతల్లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌చార్జి దివ్యస్పందన, డీఎంకే ఎంపీ కనిమొళి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తదితరులున్నారు. మాజీ ఎంపీ కవిత 2010లోనే ట్విటర్‌లో అడుగుపెట్టినప్పటికీ, 2013నుంచి  చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఉద్యమ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ భావజాల వ్యాప్తికి ట్విటర్‌ను సమర్థంగా వినియోగించారు. బతుకమ్మసహా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు విశ్వవ్యాప్త ప్రచారం కల్పించారు. తెలంగాణ సిద్ధించాక, 2014-2019 మధ్య తాను నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నప్పుడు, రాష్ట్రం, నియోజకవర్గం సమస్యలు దేశం దృష్టికి వెళ్లేలా,  సామాజిక సేవకు సాధనంగా ట్విటర్‌ ఖాతాను మలుచుకున్నారు. 


మద్దతుకు కృతజ్ఞతలు: కవిత

‘‘మనం ఇప్పుడు ఒక మిలియన్‌. మీ అందరి బే షరతు మద్దతుకు కృతజ్ఞతలు’’ అంటూ మాజీ ఎంపీ కవిత ఆదివారం ట్వీట్‌ చేశారు. తన ట్విటర్‌ ఖాతాలో  మిలియన్‌ మార్క్‌కు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని..‘మనమందరం కలిస్తే మిలియన్‌’ అని పేర్కొన్నారు.


సేవల్లో చిన్న చిన్న లోపాలనూ సరిచేశా..

రెండున్నరేళ్లుగా నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వాస్పత్రుల్లో సొంత డబ్బుతో అన్నదాన కేంద్రాలను నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో నిజామాబాద్‌, జగిత్యాలలో మరో మూడు అన్నదాన కేంద్రాలను ప్రారంభించాం. వీటి ద్వారా రోజుకు మూడు వేల మందికి ఉచిత భోజనం అందిస్తున్నాం. కరోనా వల్ల ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఇరుక్కుపోయిన అనేక మందిని సొంత ఖర్చుతో వారి స్వస్థలాలకు చేర్చాం. ఈ సేవల్లో అనుకోకుండా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు తలెత్తటమే ఆలస్యం.. వెంటనే సోషల్‌ మీడియా ద్వారా నా దృష్టికి రావటం, పరిష్కారం కావటం నిమిషాల్లో జరిగిపోయేది. థ్యాంక్స్‌ టు సోషల్‌ మీడియా !!

Updated Date - 2020-09-21T06:25:23+05:30 IST