పండగ వెళ్లాకే ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2020-10-24T08:25:04+05:30 IST
అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సేవల ప్రారంభానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది.

దసరా తర్వాతే అంతర్రాష్ట్ర బస్సులు
కిలోమీటర్లు తగ్గించుకోవడానికి..
అంగీకరించిన ఏపీఎస్‌ఆర్టీసీ
2 రాష్ట్రాల అధికారుల చర్చల్లో పురోగతి
దసరా తర్వాత ఒప్పందం కుదిరే చాన్స్
అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సేవల ప్రారంభానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. తెలంగాణలో తమ బస్సు సర్వీసులకు సంబంధించి కిలోమీటర్లను తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు అంగీకరించారు. దీంతో.. దసరా తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ వెంటనే.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించే వీలుంది.
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సేవల ప్రారంభానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కనిపించింది. తెలంగాణలో తమ బస్సు సర్వీసులకు సంబంధించి కిలోమీటర్లను తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు అంగీకరించారు. దీంతో.. దసరా తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ వెంటనే.. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించే వీలుంది. లాక్‌డౌన్‌కు ముందు వరకు ఏపీ బస్సులు తెలంగాణలో 2.64 కిలోమీటర్ల మేర తిరిగేవి. తెలంగాణ బస్సులు ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర సేవలందించేవి. అన్‌లాక్ నిబంధనల తర్వాత.. ఇరు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సేవలపై కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉండగా.. అవి ఎంతకూ ఒక కొలిక్కి రాలేదు. కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ.. మీరే కిలోమీటర్లు పెంచుకోండంటూ ఏపీ వాదించుకుంటూ వచ్చాయి. దీంతో.. ఎప్పటికప్పుడు ఫలితం లేకుండానే చర్చలు ముగిశాయి.
తాజాగా శుక్రవారం జరిగిన చర్చల్లో.. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలంగాణలో తమ బస్సులను 1.61 లక్షల కిలోమీటర్లు తిప్పేందుకు అంగీకరించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలకు మార్గం సుగమమైంది. ఈ చర్చల వివరాలను తెలంగాణ అధికారులు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్ శర్మకు వివరించారు. వారు సీఎం కేసీఆర్‌కు ఓ నివేదికను సమర్పించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆ నివేదికలో కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. అదే విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు.. ఏపీ అధికారులకు తెలియజేశారని తెలిసింది. దీనికి ఏపీ సర్కారు అంగీకరిస్తే.. మంగళ లేదా బుధవారం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.