ఆర్టీసీల మధ్య పేచీ.. ‘ప్రైవేటు’కు ఊతం

ABN , First Publish Date - 2020-09-18T09:31:33+05:30 IST

‘పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చినట్లు’ంది రెండు తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ల పరిస్థితి. కొవిడ్‌ లాక్‌డౌన్ల తర్వాత.. అంతర్రాష్ట్ర బస్సు సేవల పునరుద్ధరణపై చర్చలు కొలిక్కి

ఆర్టీసీల మధ్య పేచీ.. ‘ప్రైవేటు’కు ఊతం

చర్చల పేరుతో ఏపీ, టీఎస్‌ఆర్టీసీల సాగదీత

1.11 లక్షల కి.మీ. తగ్గించుకునే దిశగా చర్చలు

తగ్గే కిలోమీటర్లలో ప్రైవేటు బస్సులకు అవకాశాలు

ఇప్పటికే 150 వరకు ప్రైవేటు బస్సుల ఉరుకులు

సకల వసతుల ‘ప్రైవేటు’వైపే ప్రయాణికుల అడుగులు

అదే జరిగితే రెండు సంస్థలకు నష్టమే..!


హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చినట్లు’ంది రెండు తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ల పరిస్థితి. కొవిడ్‌ లాక్‌డౌన్ల తర్వాత.. అంతర్రాష్ట్ర బస్సు సేవల పునరుద్ధరణపై చర్చలు కొలిక్కి రాకపోవడం, సాగదీత వల్ల.. ప్రైవేటు ఆపరేటర్లు లబ్ధిపొందే సూచనలు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల ప్రాతిపదిక.. కాదుకాదు.. అంటూ ఇరు రాష్ట్రాలు చర్చలతో కాలయాపన చేస్తుండడంతో.. రెండు ఆర్టీసీలూ నష్టాల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఈ చర్యలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు ఊతమిచ్చేలా.. ప్రయాణికులు మరింత ఇబ్బంది పడేలా ఉన్నాయని ఆర్టీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల తీరు.. ప్రైవేటుకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ నుంచి తెలంగాణకు 150 ప్రైవేటు బస్సుల సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీకి రావాల్సిన ఆదాయాన్ని ‘ప్రైవేటు’ తన్నుకుపోతున్నా.. అధికారుల్లో చలనం లేదు. ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల నడుమ మూడు దఫాలుగా చర్చలు జరిగినా.. అవి ఓ కొలిక్కి రాలేదు. ఎండీల స్థాయిలో జరిగిన చర్చలు కూడా ఫలవంతం కాలేదు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు నష్టపోయాయి.


తెలంగాణ ఆర్టీసీ అయితే.. ఉద్యోగుల సమ్మెపోటు నష్టాన్ని ఇంకా పూడ్చుకోలేకపోతోంది. మే 19 నుంచి హైదరాబాద్‌ మినహా.. జిల్లాల్లో బస్సుల సేవలు పునఃప్రారంభమైనా.. వస్తున్న రాబడి కాస్తా డీజిల్‌, ఇతర నిర్వహణ పనులకే సరిపోతోంది. ప్రతినెలా ఉద్యోగులకు వేతనాలివ్వాల్సి వచ్చినప్పుడు.. దిక్కులు చూస్తోంది. నిజానికి హైదరాబాద్‌ సిటీ బస్సులు, జిల్లా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే.. అంతర్రాష్ట్ర సర్వీసుల వల్ల వచ్చే రాబడే ఎక్కువ. ఈ నేపథ్యంలో.. ఎంత త్వరగా అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభిస్తే.. ఆర్టీసీకి అంత త్వరగా ఊరట లభిస్తుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ‘సమన్యాయం’ పేచీ కొనసాగుతోంది. ఏపీ బస్సులు తెలంగాణలో 2.62 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ బస్సులు ఏపీలో 1.52 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. తెలంగాణ కంటే ఏపీ 1.11 లక్షల కిలో మీటర్లు ఎక్కువ నడుపుతోందని, బస్సుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని, వీటిని తగ్గించుకోవాలంటూ టీఎ్‌సఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. దీనికి ఏపీ అధికారులు 52 వేల కిలోమీటర్లను తగ్గించుకుంటామని, తెలంగాణ ఆర్టీసీ మరో 50 వేల కిలోమీటర్లు పెంచుకోవచ్చని చెప్పారు. ఈ ప్రతిపాదన సమంజసంగానే ఉందంటూ రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు.


నిజానికి రెండు రాష్ట్రాల ఆర్టీసీ.. 4.04 లక్షల కిలోమీటర్ల మేరకు అంతర్రాష్ట్ర సర్వీసులను తిప్పుతున్నాయి. ఏపీ ప్రతిపాదన అమలైతే.. ఏపీ 2.12 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ 1.92 లక్షల కిలోమీటర్ల మేరకు బస్సులను నడపవచ్చు. అంటే.. కిలోమీటర్లలో ఏమాత్రం తేడా రాదు. ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. కానీ.. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు. 1.11 లక్షల కిలోమీటర్లు తగ్గించుకుంటేనే.. ఒప్పందం చేసుకుంటామని పట్టుబడుతోంది. అదే జరిగితే.. రెండు రాష్ట్రాల్లో తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసులు 3.04 కిలోమీటర్లకే పరిమితమవుతాయి. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా.. ప్రైవేటు ఆపరేటర్లు ఆ లక్ష కిలోమీటర్లను భర్తీ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఇరు ఆర్టీసీలకు నష్టమే. 1.11 లక్షల కిలోమీటర్లను తగ్గిస్తే.. కనీసం 600 బస్సులు తగ్గిపోతాయి. ఇరు ఆర్టీసీలు ఆ మేర ఆదాయాన్ని కోల్పోతాయి. ప్రైవేటు ఆపరేటర్లు లబ్ధి పొందే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. లాక్‌డౌన్‌కు ముందు రెండు తెలుగురాష్ట్రాల్లో 600 వరకు ప్రైవేటు బస్సులు తిరిగేవి. ఇటీవల ఏపీ అనుమతించడంతో.. 150 బస్సులు ప్రారంభమయ్యాయి. 


బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులివ్వాలి

రెండు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల తగ్గింపు ఉండకూడదు. కావాలంటే టీఎ్‌సఆర్టీసీ అదనంగా 1.11 లక్షల కిలోమీటర్లు బస్సులు నడపాలి. అప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. పైగా ఆర్టీసీలకు లాభాలు వస్తాయి. ఇందుకోసం టీఎస్‌ఆర్టీసీకి గరుడ, గరుడ ప్లస్‌ బస్సులు 260 వరకు అదనంగా కావాలి. బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.

కె.రాజిరెడ్డి, ఈయూ ప్రధాన కార్యదర్శి

Updated Date - 2020-09-18T09:31:33+05:30 IST