ఆగస్టులో ఇంటర్ తరగతులు
ABN , First Publish Date - 2020-05-18T08:57:33+05:30 IST
ఇంటర్మీడియట్ తరగతులను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. అయితే మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం పదో తరగతి పరీక్షలు, ఫలితాల విడుదలపై ఆధారపడి ఉంది. టెన్త్ పరీక్షలకు హైకోర్టు అనుమతిస్తే జూన్‌లో పరీక్షలు నిర్వహించి

- భౌతిక దూరంపై బోర్డు కసరత్తు
- ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ విద్యపై దృష్టి
- కాలేజీలకు అఫిలియేషన్ ప్రకటన జారీ
- జూలై 20న గుర్తింపు కాలేజీల జాబితా
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ తరగతులను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. అయితే మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం పదో తరగతి పరీక్షలు, ఫలితాల విడుదలపై ఆధారపడి ఉంది. టెన్త్ పరీక్షలకు హైకోర్టు అనుమతిస్తే జూన్‌లో పరీక్షలు నిర్వహించి, జూలై రెండో వారంలోగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫలితాలు వెల్లడికాగానే ఇంటర్ అడ్మిషన్లకు అనుమతి ఇస్తారు. ఇందులో భాగంగా ఇంటర్ ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా జూలై 20 నాటికి ముగియనుంది. ఆరోజు గుర్తింపు గల కాలేజీల జాబితాను బోర్డు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఫస్టియర్ తరగతులను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతికదూరం తప్పనిసరి కావడంతో ఆ దిశగా బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందు కోసం ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ విద్యపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బోర్డు ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. విద్యార్థుల కోసం అన్ని పాఠ్యాంశాలు, పోటీ పరీక్షలకు సంబంధించి అనుభవజ్ఞులైన లెక్చరర్లతో వీడియో పాఠాలు చిత్రీకరించి యూట్యూబ్‌లో పొందుపరించింది. ఇదే విధానాన్ని అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు కూడా అందించాలని బోర్డు భావిస్తోంది.
అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్ జారీ
ప్రైవేటు జూనియర్ కాలేజీలకు 2020-21 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్), నూతన సెక్షన్ల కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి జూలై 8 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాతవచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించేది లేదని బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో జూన్ 17 వరకు, రూ.3 వేల జరిమానాతో జూన్ 24 వరకు, రూ.5 వేల జరిమానాతో జూలై 1 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో జూలై 8వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు.
ఆ ఏడు ధ్రువపత్రాలుంటేనే
ఈ సారి ఏ కాలేజీకి కూడా షరతులతో కూడా అనుమతి ఇవ్వకూడదని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. అనుబంధ గుర్తింపు కోసం అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉంటే అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఏడు పత్రాలను తప్పనిసరి చేసింది. ఇందులో బిల్డింగ్ ఓవర్‌షిప్, లీస్‌డీడ్ పత్రం, బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ (ఫైర్ ఎన్వోసీ), ఎఫ్‌డీఆర్, స్ట్రక్చరల్ సౌండ్, శానిటరీ ధ్రువపత్రాలను తప్పనిసరిగా దరఖాస్తుతో జతచేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అనుమతి ఇవ్వబోమని బోర్డు పునరుద్ఘాటించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను జూలై మొదటి వారంలో పూర్తి చేయనుంది. ఆ తర్వాత రాష్ట్రంలో గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల జాబితాను జూలై 20వ తేదీన బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. ఈ జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని బోర్డు కార్యదర్శి సూచించారు.