ఆపితేనే ఆగేది!

ABN , First Publish Date - 2020-03-19T09:06:35+05:30 IST

రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం మొదటి దశలోనే ఉంది. అంటే.. విదేశాల నుంచి వచ్చినవారికే వైరస్‌ పాజిటివ్‌ వస్తోంది! వారి నుంచి కుటుంబసభ్యులకు, బంధువులు, స్నేహితులకు వైరస్‌ సోకడం రెండో

ఆపితేనే ఆగేది!

కరోనా రెండో దశకు రాకుండా సర్కారు కృషి

మొదటి దశకే పరిమితం చేసే యత్నాలు

విదేశాల నుంచి వచ్చేవారిపై 14 రోజుల నిఘా

ఆలోపు ఇంట్లోంచి బయటకొస్తే క్వారంటైన్‌కు

ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరిక

ప్రజలు సహకరించకుంటే కఠిన నిర్ణయాలు

కానీ.. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు శూన్యం

కర్ణాటక, మహారాష్ట్రలలో రెండోదశకు కరోనా

అక్కడి వారిని అడ్డుకోకుంటే రాష్ట్రానికి ముప్పే

రోడ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు తప్పనిసరి


తెలంగాణ ఆపదేమి?

నారాయణపేట జిల్లాలో ఎలాంటి వైద్యతనిఖీలు లేకుండా వస్తున్న కర్ణాటక వాహనాలు 


కర్ణాటక ఆపుతోంది...

కర్ణాటకలోని రాయచూరు సమీపంలో తెలంగాణ నుంచి వెళుతున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్న కర్ణాటక సిబ్బంది


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం మొదటి దశలోనే ఉంది. అంటే.. విదేశాల నుంచి వచ్చినవారికే వైరస్‌ పాజిటివ్‌ వస్తోంది! వారి నుంచి కుటుంబసభ్యులకు, బంధువులు, స్నేహితులకు వైరస్‌ సోకడం రెండో దశ. మనదేశంలో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ప్రస్తుతం ఆ దశలో ఉన్నాయి. రెండో దశలో వైర్‌సబారిన పడినవారి నుంచి స్థానికంగా మరింత మందికి సోకడం (సామాజిక వ్యాప్తి) మూడో దశ. ఇటలీ, ఇరాన్‌ వంటిదేశాలు మూడోదశలో ఉన్నాయి. ఆ దశకు చేరితే ఆరోగ్యవ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి. అలాంటి భయానక పరిస్థితి రాకుండా.. కరోనాను మొదటిదశకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. 


 విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు,  క్లబ్బులు, పబ్బులు, పార్కుల మూసివేత అందులో భాగమే. వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో రెండో దశలో భాగంగా.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బైటకు రావొద్దని, అనవసర ప్రయాణాలు పెట్టుకొవద్దని, ప్రజలకు సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు సహకరించకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోనుంది.


వారిపై నిఘా..

విదేశాల నుంచి వచ్చే వారిని పరీక్షలు జరిపి.. ఆస్పత్రి క్వారంటైన్‌ అవసరం లేనివారిని 14 రోజులు ఇంట్లోనే ఉండాల్సిందిగా (హోం క్వారంటైన్‌) సూచిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటివారిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. ఒకవేళ వారు బయటకు వస్తే వెంటనే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ రాష్ట్రంలో వైరస్‌ రెండో దశలోకి చేరిన సంకేతాలు కనిపిస్తే ఆరోగ్య అత్యవసరస్థితిని ప్రకటించే అవకాశాలున్నాయి. తాము చేస్తున్న సూచనలను, విజ్ఞప్తులను ఆషామాషీగా తీసుకోవద్దని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తోంది.


ఇవి చాలవు..

కరోనా కట్టడి విషయంలో సర్కారు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయిగానీ.. ఇప్పటికే రెండో దశలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణ జిల్లాలకు యథేచ్ఛగా సాగుతున్న రాకపోకలపైనా దృష్టి సారించాలని.. అక్కడివారు ఇక్కడికి ఏ తనిఖీ లేకుండా వస్తే ముప్పేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేవారిని రోడ్లపై, రైల్వే స్టేషన్లలో తనిఖీ చేయడం తప్పనిసరని సూచిస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల గుండా రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాల్లోని ప్రయాణికులను వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పరిశీలించి, కరోనా లక్షణాలు లేవని నిర్ధారించాకే రాష్ట్రంలోకి అనుమతించాలని సర్కారు ఆదేశించింది. మహారాష్ట్ర, కర్ణాటక అధికారులు తమ రాష్ట్రంలోకి వచ్చేవారి విషయంలో ఈ జాగ్రత్తను పాటిస్తున్నారు.


కానీ కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో మాత్రం మన అధికారులు అందుకు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను ‘ఆంధ్రజ్యోతి’ బృందం బుధవారం సందర్శించగా అధికారుల నిష్ర్కియ స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో, కర్ణాటక అధికారులు మాత్రం గుడేబల్లూరు సమీపంలోని శక్తినగర్‌ (కర్ణాటక) వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రయాణికులను పరీక్షించిన తర్వాతే రాష్ట్రంలోకి రానిస్తున్నారు. ఆదిలాబాద్‌-మహారాష్ట్ర సరిహద్దుల్లోని పిప్పర్‌వాడ టోల్‌గేట్‌ వద్ద మాత్రం ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


భయం గుప్పిట పుణె రెండో దశకు వైరస్‌

(పుణె నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో.. వైర్‌సకు కేంద్రస్థానం పుణె నగరం. మహారాష్ట్రలో 42 మంది బాధితుల్లో 18 మంది ఒక్క పుణెలోనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో రెండో దశ వ్యాప్తి కూడా పుణెలోనే మొదలైంది. దుబాయ్‌ నుంచి ఈనెల ఒకటిన వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆరోజు అతడు ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌లో ఇంటికి వెళ్లాడు. మాంజిరీకి చెందిన ఆ క్యాబ్‌ డ్రైవర్‌కు.. వైరస్‌ సోకింది. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను, అతడి కుటుంబాన్ని క్వారంటైన్‌లో పెట్టినా.. అప్పటికే ఆ కుటుంబం పలువురిని కలవడంతో మాంజిరీ పరిసరాల్లోని కాలనీల వాసులు భయంతో వణికిపోతున్నారు.


చిన్నపాటి అనారోగ్యానికే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అలాగే.. దుబాయ్‌ నుంచి ఇటీవల పుణె వచ్చిన యువతికీ కరోనా సోకడంతో స్థానికుల్లో భయం మరింత పెరిగింది. పుణెలో 18 కరోనా కేసులు ఉండగా.. బాధితుల్లో 10 మంది పిమ్రిచించ్‌ వాడకు చెందిన వారు కావడంతో.. అక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ జంట ఐరోపా దేశాలకు హనీమూన్‌కు వెళ్లింది. తిరుగుప్రయాణంలో బెంగళూరు మీదుగా పుణె చేరుకుంది. ఆ జంటలో భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడు ఆస్పత్రిలో ఉండగా.. భార్య రైలులో ఆగ్రాకు వెళ్లిపోయింది. క్వారంటైన్‌ కాకుండా ప్రయాణించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-19T09:06:35+05:30 IST