దుబ్బాక ఉప ఎన్నిక ముందు రాములమ్మ ఏం చేయబోతున్నారు!?

ABN , First Publish Date - 2020-10-31T15:00:44+05:30 IST

ఇప్పుడిదే అంశం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దుబ్బాక ఉప ఎన్నిక ముందు రాములమ్మ ఏం చేయబోతున్నారు!?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైందా? కాంగ్రెస్ పార్టీకి కటీఫ్ చెప్పి కమలంతో కరచాలనానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాములమ్మతో సంప్రదింపులు జరుపుతున్నారా? దుబ్బాక ఉప ఎన్నిక ముంగిట హస్తం పార్టీకి మరో షాక్‌ తప్పదా? ఇప్పుడిదే అంశం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


లైన్ క్లియర్ అయినట్లేనా..!?

విజయశాంతి మళ్లీ సొంత గూటికి వెళ్తున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీలో చేరేందుకు రాములమ్మకు లైన్ క్లియర్ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్నాళ్లుగా హస్తం పార్టీతో అంటిముంటనట్లుగా ఉంటున్న ఆమె కమలం పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ తనను పెద్దగా పట్టించుకోకపోవడం, మరోవైపు బీజేపీ ఆహ్వానించడంతో ఫైర్ బ్రాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి ఆమెతో చర్చలు జరపడమే ఈ ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. అయితే మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బయటికి చెబుతున్నప్పటికీ...రాములమ్మను పార్టీలోకి ఆహ్వానించడానికే వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


రాములమ్మ రాజకీయ ప్రస్థానం ఇలా..!

1998లో బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని విజయశాంతి ప్రారంభించారు. ఆ తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి..2009లో తల్లి తెలంగాణ అని సొంత పార్టీని స్థాపించారు. తరువాత దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్‌ తరఫున 2009 ఎన్నికల్లో ఎంపీగా కూడా విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో విబేధాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. 2014లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో హస్తం గుర్తుపై మెదక్ నుంచి పోటీ కూడా చేశారు. ఆ తర్వాత ఆమె పోటీ చేయకుండా పార్టీ ప్రచారానికే పరిమితమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్  ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా ఏఐసీసీ బాధ్యతలు అప్పగించింది. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా విజయశాంతి విస్తృత ప్రచారం చేశారు. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చెందడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గాంధీభవన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.  అయితే టీపీసీసీ వ్యవహారశైలి వల్లనే కాంగ్రెస్‌తో అంటీ ముంటనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. ముఖ్యమైన సమావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొత్తగా వచ్చిన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ను మర్యాదపూర్వకంగా కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. 


వ్యూహానికి పదును..!?

ఓ వైపు కాంగ్రెస్ తనను సరిగా గౌరవించకపోవడం, మరోవైపు రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మెరుగైనట్లు కనిపించడం లేదని రాములమ్మ భావిస్తుందట. ఈ నేపథ్యంలో తన దారి తాను చూసుకోవాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సరిగ్గా అదే  సమయంలో అటు బీజేపీ నేతలు కూడా విజయశాంతిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతోన్న బీజేపీ ఆ దిశగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టింది. దుబ్బాకలో జరగబోతున్న ఉప ఎన్నికలను టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మూడ్ క్రియేట్ చేస్తోంది. ఇక రాములమ్మను చేర్చుకోవడం ద్వారా హస్తం పార్టీ పెద్దల ఆత్మ విశ్వాసాన్ని మరింత దెబ్బకొట్టాలనే వ్యూహానికి పదునుపెట్టినట్లు కనిపిస్తోంది. 


ఎందుకు ఖండించట్లేదు.. ఏం చేయబోతున్నారు..!?

మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా పనిచేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆమెకు అనుచరులు, అభిమానులు ఉన్నారు. ఆమెను చేర్చుకోవడం ద్వారా దుబ్బాక ఉప ఎన్నికలో కమలం పార్టీకి కొంత ప్లస్ అవుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకోసం రాములమ్మతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే విజయశాంతి కూడా ఈ వార్తలను ఖండించకపోవడంతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారనే ప్రచారానికి ఊతమిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా ఉన్న రాములమ్మ ముహూర్తం చూసుకుని కాషాయ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది దుబ్బాక ఉప ఎన్నికకు ముందా? ఆ తర్వాత అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read more