దూసుకొస్తున్న వరద
ABN , First Publish Date - 2020-10-19T08:36:17+05:30 IST
భీమా నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున నీరు చేరుతుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భీమా నుంచి 8లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు

భీమా నుంచి 8 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రేపటికి రాష్ట్రానికి.. మహారాష్ట్ర లేఖ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
భీమా నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున నీరు చేరుతుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భీమా నుంచి 8లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు మహారాష్ట్ర అధికారులు ఆదివారం జూరాల అధికారులకు లేఖ పంపించారు. కర్ణాటకతో పాటు నారాయణపేట జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరీవాహక ప్రాంతాల్లో దాదాపు మూడు వేల ఎకరాల్లో వరి నీట మునిగింది. ముందు జాగ్రత్తగా నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలను అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల నుంచి భీమా నదికి వస్తున్న నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశముండటంతో తీర ప్రాంత వాసులు అపమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం జూరాలకు 4.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 1.30 లక్షల క్యూసెక్కులు, భీమా నుంచి 3.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది.
దీంతో జూరాల 43 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, భీమా నుంచి భారీ వరద 20వ తేదీకి జూరాలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 4.42 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 43,494, హంద్రీ నుంచి 117.. మొత్తం 4.85 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. ప్రాజెక్టు పది గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 4.74 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ 18 గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. సాగర్ నుంచి 4.25 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి అంతే నీరు వస్తోంది. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు 38,715 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 9 గేట్లు ఎత్తి 59,991 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.