అక్రమం.. అడ్డుకోండి

ABN , First Publish Date - 2020-05-13T08:27:46+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాలయసీమ లిప్టు ప్రాజెక్టు నిర్మాణాలు అక్రమమని తెలంగాణ

అక్రమం.. అడ్డుకోండి

  • పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం చట్ట విరుద్ధం
  • అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి ఏదీ?
  • పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ నిర్ణయం
  • టెండర్ల ప్రక్రియను ఆపండి
  • కృష్ణా బోర్డుకు, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు
  • ఇద్దరి దోస్తీ బయటపెడతాం: ఉత్తమ్‌
  • దక్షిణ తెలంగాణ ఎడారే: రేవంత్‌
  • నేడు కాంగ్రెస్‌ ధర్నా, బీజేపీ దీక్ష


హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాలయసీమ లిప్టు ప్రాజెక్టు నిర్మాణాలు అక్రమమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టానికి విరుద్ధంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏపీ పూనుకుంటోందని కృష్టా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల కారణంగా తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టకూడదని గుర్తు చేసింది. వీటిని అడ్డుకోవాలని, టెండర్ల ప్రక్రియను కూడా జరగకుండా చూడాలని కోరింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కుల ప్రవాహానికి పెంచడంతోపాటు రాయలసీమ ప్రాజెక్టు పేరిటకొత్తగా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడానికి మరో లిప్టు ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది.


ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం రాత్రి సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌.. కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర జల వనరుల అభివృద్ధి, జలశక్తి శాఖ కార్యదర్శికి కూడా పంపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలని గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే తాము ఫిర్యాదు చేశామని లేఖలో తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది. తాజాగా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా రాయలసీమ లిప్టు ప్రాజెక్టు నిర్మాణంతోపాటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యం 80 వేల క్యూసెక్కుల పెంపు కోసం రూ.6,829.15 కోట్ల విలువైన పనులకు ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసిందని వివరించింది.


ఈ నిర్ణయం వల్ల రోజూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 8 టీఎంసీల నీటిని ఏపీకి తరలించే అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే జరిగితే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని, ముఖ్యంగా కృష్ణా బేసిన్‌పై తెలంగాణలోని అనేక కరువు ప్రాంతాలు ఆధారపడ్డాయని తెలిపింది. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రిజర్వాయర్‌గా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌కు తాగునీటితోపాటు మిషన్‌ భగీరథ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉందని పేర్కొంది. నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టుతోపాటు ఏఎమ్మార్పీ, డిండి, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచే నీరు అందాల్సి ఉందని, జల విద్యుత్‌ ఉత్పత్తి కూడా జరగాల్సి ఉంటుందని వివరించింది.


ఇతర బేసిన్లకూ తరలిస్తారు..

ఏపీ నిర్ణయం కారణంగా కృష్ణా బేసిన్‌ నీటిని పెన్నా వంటి ఇతర బేసిన్లలోకి తరలిస్తారని, ఇది చట్ట వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. ఇప్పటికే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయకుండా భారీగా నీటిని తరలిస్తున్నారని, ఈ విషయంపై తెలంగాణ నాలుగేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని గుర్తు చేసింది. కృష్టా ట్రైబ్యునల్‌-2లో పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల నీటి ప్రవాహానికే అనుమతి ఉందని, కానీ.. దానిని అక్రమంగా 44 వేల క్యూసెక్కులకు ఏపీ పెంచిందని, దీనిపై ఇప్పటికే ట్రైబ్యునల్‌లో ఫిర్యాదులు ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టులో కూడా ఎస్‌ఎల్‌సీ పెండింగ్‌లో ఉన్నందున.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టుగా కూడా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది.


కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి రాష్ర్టానికి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో తెలంగాణకు 575 టీఎంసీలను కేటాయించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. రానున్న రోజుల్లో ఈ మేరకు నీటి కేటాయింపులు జరగాలని తెలిపింది. పైగా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని ఏపీ నిర్ణయాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరింది. 

Updated Date - 2020-05-13T08:27:46+05:30 IST