వదలని వాన

ABN , First Publish Date - 2020-09-18T09:28:58+05:30 IST

వర్షం ఉధృతి తగ్గిందే తప్ప శాంతించలేదు. రైతన్నల ఆందోళన పోలేదు. వరుసగా రెండో రోజూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నీట మునిగిన వరి, కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, ఆముదం తదితర పంటలను చూసి

వదలని వాన

రాష్ట్రంలో రెండోరోజూ వర్షం

వేల ఎకరాల్లో నీటమునిగిన పంటలు

ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం

చెరువులు, కుంటలకు గండ్లు

వరి, పత్తి, కంది, జొన్న పంటలకు నష్టం 

ఇళ్లు కూలి ముగ్గురు.. వరదలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి

నాగర్‌కర్నూల్‌లో 12.3 సెంటీమీటర్ల వర్షం

మరో 2 రోజులు భారీ వర్షాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

వర్షం ఉధృతి తగ్గిందే తప్ప శాంతించలేదు. రైతన్నల ఆందోళన పోలేదు. వరుసగా రెండో రోజూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నీట మునిగిన వరి, కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, ఆముదం తదితర పంటలను చూసి రైతుల గుండె చెరువైంది. పాడుబడ్డ ఇళ్లు  కూలాయి.  వాకిళ్లలో మోకాలిలోతులో నీళ్లు చేరుతున్నాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలకు పునరావాసం ఏర్పాటు చేయకపోవడంతో వరద నీటిలో చిక్కుకున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 220 ఎకరాల్లో వరి, 1400కు పైగా ఎకరాల్లో పత్తి, 2100 ఎకరాల్లో కందులు, 1500 ఎకరాల్లో జొన్న పంట దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 1,156 ఇళ్లు పాక్షికంగా, 180 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లాలో 2,828 ఎకరాల్లో, గద్వాల జిల్లాలో  897 ఎకరాల్లో, రంగారెడ్డి జిల్లా 3వేల ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 4,155 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భారీ వర్షాలతో మిద్దెలు కూలి ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో వాగు దాటుతూ ఇద్దరు వ్యక్తులు నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం కర్ల గ్రామంలో పొలానికి వెళ్లిన రైతు, మంజీరాకు  వరద ఉధృతి పెరగడంతో చిక్కుకుపోయాడు.


సమీపంలోని ఓ ఆలయం మీద ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం కెనాల్‌ రాజాపూర్‌, కోడేరు వద్ద దెబ్బతినగా కొల్లాపూర్‌లోని ఒరిదెల ఊర చెరువు, పెంట్లవెల్లి మండలంలోని భీమా కెనాల్‌, కొండూరులోని చెరువులకు గండ్లు పడ్డాయి. వికారాబాద్‌ జిల్లా దోర్నాల-ధారూరు స్టేషన్‌ గ్రామాల మధ్య వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మార్ధాండ గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీళ్లు చేరాయి. వనపర్తి జిల్లా శంకరసముద్రం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌తో కానాయిపల్లిలో 12 ఇళ్లలోకి నీళ్లు చేరాయి.  యాదాద్రి జిల్లా వలిగొండ మండలం భీమలింగం కత్వ వద్ద బ్రిడ్జిపై నుంచి మూసీ ఉప్పొంగుతోంది. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలంలోని గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్‌లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  సిరిసిల్ల జిల్లా వేములవాడ మునిసిపాలిటీ పరిఽధిలోని లక్ష్మీపూర్‌ చెరువుకు గండి పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  మెదక్‌ జిల్లాలో 3.8 సెం.మీ, సంగారెడ్డి జిల్లాలో 3.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఏటా జూన్‌-సెప్టెంబరు వరకు 151.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంటుంది. ఈసారి ఇదే సమయంలో ఐదింతలు ఎక్కువగా 688 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు

రానున్న మూడురోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని, 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. 


మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు

రానున్న మూడురోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని, 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. 

Updated Date - 2020-09-18T09:28:58+05:30 IST