తలనీలాలు.. ఆగమాగం!
ABN , First Publish Date - 2020-02-08T10:46:46+05:30 IST
ఒక టెంటు.. దాని కింద ఎటు చూసినా చెల్లాచెదురుగా.. కుప్పలు కుప్పలుగా పడివున్న వెంట్రుకలు. వాటిని తొక్కుకుంటూ తలనీలాల కోసం వచ్చే భక్తులతో అక్కడంతా

కల్యాణకట్టల్లోనూ కొరవడిన సౌకర్యాలు
మేడారం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఒక టెంటు.. దాని కింద ఎటు చూసినా చెల్లాచెదురుగా.. కుప్పలు కుప్పలుగా పడివున్న వెంట్రుకలు. వాటిని తొక్కుకుంటూ తలనీలాల కోసం వచ్చే భక్తులతో అక్కడంతా రద్దీ. వారికి అక్కడ కూర్చునే ఏర్పాట్లులేవు. నిలబెట్టే గుండ్లు గీస్తున్నారు.. ఇలా తలనీలాల సమర్పణ అనేది మేడారంలో ఆగమాగంగా.. ఓ ప్రహసనంగా మారిపోయింది. మేడారంలోని 20 కల్యాణ కట్ట ల్లో ఇప్పుడిదే పరిస్థితి! మేడారంలో 25 కల్యాణ కట్టలున్నాయి. ఇందులో 5 మాత్రమే శాశ్వత కల్యాణ కట్టలు. మిగతా వాటిని తాత్కాలికంగా టెంట్ల కిందే నిర్వహిస్తున్నారు. పారిశుధ్యం కొరవడటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బయట కూడా ఎక్కడ పడితే అక్కడ క్షురకులు, గుండ్లు గీస్తూ ఎలాంటి టోకన్ ఇవ్వకుం డా ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. అంతా చూస్తున్నా అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
గతంలో అనుమతించిన క్షురకులే గుండ్లు గీసేవారు. మేడా రం, ఆ పరిసర గ్రామాల్లోని క్షురకులు సమావేశమై జాతరలో తలనీలాలు తీసేవారికి సభ్య త్వం మంజూరు చేసేవారు. ఈసారి ఆ ప్రక్రి య జరగలేదు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తు లు వస్తారని.. ప్రతి 10మంది భక్తుల్లో ముగ్గురు తలనీలాలు సమర్పించుకుంటారని ఓ అంచనా ఉన్నా ముందస్తు చర్యలు చేపట్టలేదు. క్షురకుల్లో ఎవ్వరికీ ప్రత్యేకంగా సభ్యత్వం ఇవ్వలేదు. దీంతో జాతరలో ఎవరు పడితే వారు ఇష్టారీతి న గుండ్లు చేస్తున్నారు. జంపన్నవాగులో మెట్లమీద కూడా గుండ్లు గీస్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు 20 మందికి తగ్గకుండా గుండ్లు గీస్తున్నారని అధికారులు చెబుతున్నారు.