మతం పేరుతో చిచ్చు!
ABN , First Publish Date - 2020-11-03T07:48:59+05:30 IST
తెలంగాణలో కొందరు మతం పేరుతో చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలన్నీ తీరిపోతున్నాయని,
తెలంగాణ ఇమేజ్‌ను చెడగొట్టే దురాలోచన.. క్కడి మట్టిలోనే పరమత సహనం ఉంది
విద్వేషపు విత్తనాలకు ఇక్కడ చోటు లేదు
బీజేపీ వారి కంటే మాకే ఎక్కువ దేశ భక్తి
నల్లధనం తేలేదు.. నల్ల చట్టాలు తెచ్చింది
రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
బీజేపీ, కాంగ్రె్‌సకు రాష్ట్రానికో అజెండా..
మాకు తెలంగాణ ఒక్కటే అజెండా: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొందరు మతం పేరుతో చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలన్నీ తీరిపోతున్నాయని, దీంతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే వారికి రాజకీయంగా పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే తప్పుడు దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను విమర్శించారు. బీజేపీకి రాజీనామా చేసిన రావుల శ్రీధర్‌రెడ్డి, కంజర్ల మహేందర్ యాదవ్, పల్లవియాదవ్ తదితరులు సోమవారం అనుచరులతో కలిసి టీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు.
‘మతం ప్రచారాస్త్రం కానే కాదు. ఎవరి మతం వారిది. దేశంలోని ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ పెద్ద యాగం చేసి తన హిందూ ధర్మాన్ని చాటుకున్నారు. అదే సమయంలో మేము వేరే మతాల వారిని కించపరిచే, తక్కువ చేసి చూపే కుసంస్కారులం కాదు. మతం పేరుతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు’’ అని అన్నారు. తెలంగాణ మట్టిలోనే పరమత సహనం ఉందని, విద్వేషపు విత్తనాలకు ఇక్కడ చోటు లేదని స్పష్టం చేశారు.
ఇక దేశభక్తి ప్రదర్శనాస్త్రం కాదని, వాళ్ల కంటే తమకే ఎక్కువ దేశభక్తి ఉందని చెప్పారు. ఆరేళ్లుగా పెంచుకుంటూ వెళ్తున్న తెలంగాణ ఇమేజ్‌ను రాజకీయాల కోసం కొందరు చెడగొట్టే దురాలోచన చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ వల్ల తలదించుకునే దుస్థితి..
ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుల కోసం చేసిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. విదేశాల నుంచి నల్లధనం వాపస్ తెస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటివరకు ఆ పని చేయలేదని, కానీ.. రైతుల నడ్డివిరిచే నల్ల చట్టాలను మాత్రం తెచ్చిందని ఆరోపించారు. తాజా వ్యవసాయ, విద్యుత్తు సంస్కరణల బిల్లులు అందులో భాగమేనన్నారు.
‘వ్యవసాయ బిల్లుతో రైతులు బీజేపీకి దూరమయ్యారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో మధ్య తరగతి ప్రజలు దూరమవుతున్నారు. కరోనా దెబ్బకు రోడ్డున పడ్డ వలస కార్మికులు దూరమయ్యారు. భ్రమలు తొలగిపోయి యువత దూరమైంది. ఒంటెద్దు పోకడతో మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. క్షేత్రంలోని కిసాన్ క్షేమంగా లేడు. సరిహద్దుల్లో జైవాన్ సురక్షితంగా లేడు. పార్లమెంటులో బీజేపీ చర్యల వల్ల రాజ్యాంగం కూడా సంక్షోభంలో పడింది’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
కేసీఆర్ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు
కేసీఆర్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారని దేశమంతా భావిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినప్పటికీ, ఆయన నాయకత్వం కావాలని ప్రజలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారని తెలిపారు.
‘‘దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. బీజేపీ, కాంగ్రెస్ 28 అజెండాలతో ముందుకు వెళ్తాన్నాయి. టీఆర్‌ఎ్‌సకు ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్‌కు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. ఇక్కడి పేద ప్రజలు, అన్ని వర్గాలు సుఖంగా ఉండాలన్న అజెండా తప్ప మరో అజెండా లేదు’’ అని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివా్‌సగౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు.