బీజేపీ విజయానికి వైసీపీ గండి!
ABN , First Publish Date - 2020-12-05T08:40:18+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయాలకు వైసీపీ గండి కొట్టిందా? చాలా చోట్ల జగన్ పార్టీ కాషాయ దళం గెలుపును అడ్డుకుందా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ముఖ్యంగా సెటిలర్లు ప్రభావం చూపే డివిజన్లలో బీజేపీకి వ్యతిరేకంగా తెరవెనుక పనిచేసిన వైసీపీ నేతలు.. ఆయా స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి

సెటిలర్లున్న చోట వ్యతిరేకంగా పనిచేసిన జగన్ పార్టీ
27 సీట్లలో ‘కారు’ గెలుపు.. వైసీపీ పరోక్ష సాయం?
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయాలకు వైసీపీ గండి కొట్టిందా? చాలా చోట్ల జగన్ పార్టీ కాషాయ దళం గెలుపును అడ్డుకుందా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ముఖ్యంగా సెటిలర్లు ప్రభావం చూపే డివిజన్లలో బీజేపీకి వ్యతిరేకంగా తెరవెనుక పనిచేసిన వైసీపీ నేతలు.. ఆయా స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి బాటలు వేసినట్లు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ గెలిచిన డివిజన్లలో దాదాపు సగం మేరకు సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఉన్నాయంటే.. బీజేపీ అభ్యర్థుల విజయానికి వైసీపీ ఏ మేరకు గండి కొట్టిందన్నది స్పష్టమవుతోంది. సెటిలర్లు ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఏకంగా 27 డివిజన్లను గెలుచుకుంది. 2018 తెలంగాణ శాసనసభ, 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వైసీపీలు పరస్పరం సహకరించుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కాంగ్రెస్, టీడీపీలకు నష్టం జరిగింది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు వైసీపీ అందించిన పరోక్ష సహకారంతో బీజేపీకీ భారీగా నష్టంవాటిల్లింది. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలనే ప్రతిష్ఠాత్మకంగా భావించింది.
అధికారంలో ఉన్న టీఆర్‌ఎ్‌సను గ్రేటర్ ఎన్నికల్లో మట్టి కరిపించి 2023 ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయమని చాటాలనుకుంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కంటే బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుచుకున్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎ్‌సకు వైసీపీ పరోక్ష సహకారం అందించడంతో ఆ అవకాశాన్ని కోల్పోయింది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తేడా అతి కొద్ది డివిజన్లు మాత్రమే. మిగిలిన ప్రాంతాల్లోలాగానే సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లోనూ గెలిచినట్లయితే టీఆర్‌ఎస్ కంటే ఎక్కువ డివిజన్లు బీజేపీకి వచ్చి ఉండేవంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, ఎవరికీ మద్దతూ ఇవ్వబోమని ప్రకటించిన వైసీపీ.. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు చెబుతున్నారు.