మెరికలు.. మెరుపులు!

ABN , First Publish Date - 2020-05-19T10:21:42+05:30 IST

వారేమీ శాస్త్రవేత్తలు కారు. పోనీ.. దేశంలోని ప్రఖ్యాత టెక్నికల్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో చదువుకున్న వారూ కారు. కేవలం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి విద్యను మాత్రమే చదువుతున్నారు.

మెరికలు.. మెరుపులు!

  • సన్‌గ్లాస్‌లు, టచ్‌లెస్‌ డోర్‌ బెల్స్‌, శానిటైజేషన్‌ బ్యాండ్‌, పోర్టబుల్‌ వెంటిలేటర్‌
  • కొవిడ్‌-19పై పోరులో.. పాఠశాల విద్యార్థుల సృజన


వారేమీ శాస్త్రవేత్తలు కారు. పోనీ.. దేశంలోని ప్రఖ్యాత టెక్నికల్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో చదువుకున్న వారూ కారు. కేవలం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి విద్యను మాత్రమే చదువుతున్నారు. అయితేనేం.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరు చేయడంలో చిట్టి మెదళ్లకు పదును పెట్టారు. కొవిడ్‌-19 నుంచి రక్షించుకునే మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలోనే డిస్టెన్స్‌ సెన్సార్స్‌తో కూడిన సన్‌ గ్లాస్‌లు, పోర్టబుల్‌ వెంటిలేటర్లు, టచ్‌లెస్‌ డోర్‌బెల్స్‌ను సృష్టించి అందరినీ అచ్చరువొందిచ్చారు.                                 

 న్యూఢిల్లీ


టచ్‌లెస్‌ డోర్‌బెల్‌

సార్థక్‌ జైన్‌, ఢిల్లీలోని షాలిమర్‌ బాగ్‌లో ఉన్న మోడరన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. ఇతను ఆటోమేటెడ్‌ టచ్‌లెస్‌ డోర్‌బెల్‌ ‘అర్డ్యునో’ను రూపొందించాడు. ఇది అలా్ట్రసోనిక్‌ సెన్సార్‌ విధానంలో పనిచేస్తుంది. డోర్‌ బెల్‌ను ముట్టుకోకుండానే ఇది మోగుతుంది. సార్థక్‌ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులు ప్రతిరోజూ అనేకమార్లు డోర్‌బెల్‌ను మోగిస్తారు. ఈ క్రమంలో బెల్‌ స్విచ్‌ను టచ్‌ చేస్తారు. దీంతో వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది. దీనిని నిరోధించేందుకే ‘అర్డ్యునో’ను రూపొందించా. ఈ బెల్‌కు 30 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో ఎవరైనా నిలబడితే ఆటోమేటిక్‌గా అది బీప్‌ శబ్దం చేస్తుంది’’ అని వివరించాడు. 


శానిటైజేషన్‌ బ్యాండ్‌

శివం ముఖర్జీ, ఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థి. ఇతను ‘అభయ్‌’ అనే శానిటైజేషన్‌ బ్యాండ్‌ను రూపొందించాడు. ముఖర్జీ మాట్లాడుతూ..‘‘ఈ బ్యాండ్‌.. ప్రోక్సిమిటీ సెన్సార్‌, యూవీ లైట్‌తో పనిచేస్తుంది. మణికట్టుపై ధరించడం ద్వారా ఎదుటి వ్యక్తుల నుంచి వ్యాపించే క్రిములను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఆల్కహాల్‌ బేస్డ్‌ స్ర్పే ద్వారా నిరోధిస్తుంది. ఈ బ్యాండ్‌ పూర్తిగా కంప్యూటర్‌ నియంత్రణలో, యాప్‌ ద్వారా పనిచేస్తుంది’’ అని వివరించాడు.