ఆస్తి నష్టం చేస్తే కేసు నమోదు చేయాల్సిందే
ABN , First Publish Date - 2020-12-30T08:21:45+05:30 IST
దురాక్రమణ (ట్రెస్‌పాస్), ఆస్తి నష్టం చేయడం, బెదిరించడం వంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తే క్రిమినల్ లా ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లను బెదిరించి, ఆస్తి నష్టం

పోలీసులకు స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
పిటిషనర్‌కు భద్రత కల్పించాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దురాక్రమణ (ట్రెస్‌పాస్), ఆస్తి నష్టం చేయడం, బెదిరించడం వంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తే క్రిమినల్ లా ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లను బెదిరించి, ఆస్తి నష్టం చేయడంతోపాటు నిద్రలేనిరాత్రులు గడిపేలా చేసిన ఆరే ఆకాశ్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్లు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాలని పోలీసులకు సూచించింది. నిందితునిపై ఏం చర్యలు తీసుకున్నారో కోర్టుకు చెప్పాలన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబరు 31కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆరే ఆకాశ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా, అర్లి బి. మండలం, బెల్లూరి గ్రామ పంచాయతీకి చెందిన ఫిరోజ్ అహ్మద్‌ఖాన్ మరోకరకు ఆదిలాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీ చేసి ఊరుకున్నారు. సివిల్ వివాదం అయినందువల్ల తాము జోక్యం చేసుకోలేమన్నారు. దీంతో బాధితులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అయినా చర్యలు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. నమోదు చేయదగ్గ నేరాభియోగాలు (కాగ్నిజబుల్) ఉన్నప్పటికీ కేసు నమోదు చేయకుండా సివిల్ వివాదం అని చెప్పి తప్పించుకోజూసిన పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో ఆదిలాబాద్ రూరల్ పీఎ్‌సకు చెందిన ఎస్‌ఐ ఏ. హరిబాబు, సీఐ కె. పురుషోత్తం మంగళవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. బాధితులు ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదని ధర్మాసనం అధికారులను నిలదీసింది. కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తామని మరోసారి హెచ్చరించింది. ఏజీ బీఎస్ ప్రసాద్ వివరణ ఇస్తూ సివిల్ నేచర్ ఉన్నందున ఎస్‌ఐ జీడీ ఎంట్రీచేశారని కోర్టుకు తెలిపారు. కేసు నమోదు చేయాలని తాను సూచిస్తాన్నారు. దీంతో నిందితునిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణ కల్పించాలని ఆదిలాబాద్ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.