‘నెక్లెస్‌’కు మెరుగులు

ABN , First Publish Date - 2020-04-24T10:26:38+05:30 IST

హుస్సేన్‌సాగర్‌కు మణిహారంగా ఉన్న నెక్లెస్‌ రోడ్డుకు మెరుగులు దిద్దుతున్నారు.

‘నెక్లెస్‌’కు మెరుగులు

26 కోట్లతో రోడ్డు ఆధునికీకరణ.. 6 కిలోమీటర్లు వైట్‌ ట్యాప్‌ రోడ్డు


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్‌కు మణిహారంగా ఉన్న నెక్లెస్‌ రోడ్డుకు మెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుత బీటీ రోడ్డును తొలగించి వాక్యూమ్‌ డీవాటర్డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (వీడీసీసీ) రోడ్డును నిర్మించనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేగంగా పనులు పూర్తి చేసి నెక్లెస్‌ రోడ్డును మరింత మెరుగుపరిచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. హుస్సేన్‌సాగర్‌ తీరాన గల ఆరు కిలోమీటర్ల నెక్లెస్‌ రోడ్డు పర్యాటకంగా పేరుగాంచింది. రోజూ ఏదో ఒక కార్యక్రమంతో సందడిగా కనిపిస్తుంది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అధికారులు నెక్లె్‌స రోడ్డు సుందరీకరణకు ప్రాధాన్యమిచ్చారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన నెక్లెస్‌ రోడ్డును ఆధునికీకరించాలని నిర్ణయించారు.


సుమారు రూ.26 కోట్ల వ్యయంతో ఆరు కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు స్థానంలో వీడీసీసీ రోడ్డుగా మార్చే పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. హెచ్‌ఎండీఏ పర్యవేక్షణలో అధికారులు పనులు చేపట్టారు. వీడీసీసీ రోడ్డును వైట్‌ ట్యాపింగ్‌ రోడ్డు అంటారు.ఈ రోడ్డును వేశాక తవ్వకాలు లేకుండా ఉంటే పదేళ్లకు పైగా ఎలాంటి మరమ్మతులు ఉండవు. నెక్లెస్‌ రోడ్డులో మున్ముందు కేబుల్‌, పైపులైన్‌ పనులు జరిగే పరిస్థితి లేకపోవడంతో పూర్తిగా వైట్‌ ట్యాపింగ్‌ వేస్తున్నారు. ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి సికింద్రాబాద్‌ బుద్ధభవన్‌ సెయిలింగ్‌ క్లబ్‌ వరకు ఆరు కిలోమీటర్ల పొడవున ఉన్న బీటీ రోడ్డును పూర్తిగా తొలగించి వైట్‌ ట్యాపింగ్‌ వేస్తారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 

Updated Date - 2020-04-24T10:26:38+05:30 IST