తెలంగాణ బడ్జెట్: హరీష్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ABN , First Publish Date - 2020-03-08T17:38:58+05:30 IST
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు...

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ బడ్జెట్ అంటే సామాజిక విలువల స్వరూపమన్నారు. భారత ఆర్థికవృద్ధిరేటు ఏడాది నుంచి తగ్గుతూ వస్తోందన్నారు. రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్‌లలో కోత పడిందన్నారు. కేంద్రం నుంచి ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం సకాలంలో రావడం లేదన్నారు. ‘కేంద్రం నుంచి తగిన సహకారం లభించడం లేదు. అరకొరగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. దేశవృద్ధి 11.2 నుంచి 7.5శాతానికి తగ్గింది. తెలంగాణ రెండంకెల వృద్ధిరేటు సాధించింది’ అని హరీష్‌రావు వెల్లడించారు.
సత్ఫలితాలు వస్తున్నాయ్!
‘వ్యవసాయరంగంలో 23.7శాతం వృద్ధి సాధించాం. పాడిపశువుల రంగంలో 17.3శాతం వృద్ధి. చేపల పెంపకంలో 8.1శాతం వృద్ధి సాధించాం. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2 లక్షల 28 వేల 216. దేశ తలసరి ఆదాయం కేవలం లక్షా 35 వేల 50. రైతు బంధు పథకం ద్వారా సత్ఫలితాలు. అనేక రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలు ప్రవేశపెట్టాయి. రైతు బంధు సాయాన్ని ఎకరానికి రూ.10 వేలకు పెంచాం. రైతుబంధు కోసం గత బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించాం’ అని మంత్రి హరీశ్ తెలిపారు.
రైతు రుణమాఫీ కోసం ఈ ఏడాది..
‘ఈ బడ్జెట్‌లో రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు ప్రతిపాదించాం. రైతు బీమా పథకాన్ని అమలు చేశాం. 18 నుంచి 60 ఏళ్లు ఉన్న ప్రతి రైతుకు బీమా కల్పిస్తున్నాం. రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇస్తున్నాం. రైతు బీమా కోసం రూ.1,100 కోట్లు కేటాయించాం. రూ.16,124 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాం. ఆర్థిక మాంద్యాన్ని లెక్కచేయకుండా రుణమాఫీ చేశాం. రూ.25 వేల లోపు ఉన్న రుణాల మాఫీ కోసం రూ.1,190 కోట్లు ఇచ్చాం. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు ఇస్తున్నాం’ అని హరీష్‌రావు వెల్లడించారు.
ఎంత ఖర్చైనా సరే..!
‘ఎరువులు, విత్తనాలను గోడౌన్లలో నిల్వ చేస్తున్నాం. 22.47 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు ఉన్నాయి. విత్తనాల సబ్సిడీ కోసం 2018-19లో రూ.142 కోట్లు మంజూరయ్యాయి. వరి, పత్తి, మొక్క జొన్న, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎంత ఖర్చైనా మొత్తం కందులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ ఇచ్చాం. బీసీలకు 90శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ కల్పిస్తున్నాం’ అని హరీష్ తెలిపారు.
లాభాలొచ్చాయ్!
‘పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. సమైక్యపాలకులు విజయడైరీని నిర్వీర్యం చేశారు. విజయడైరీకి రూ.35 కోట్ల లాభాలు వచ్చాయి. రైతుల నుంచి సేకరించే పాలకు లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకం. వేగంగా పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టాం’ అని హరీశ్ తెలిపారు.