పారని పథకాలు

ABN , First Publish Date - 2020-12-06T07:17:35+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మంత్రదండంలో మహత్తు పోయింది. పథకాల పేరుతో లక్షల మందికి వేల కోట్లు కుమ్మరిస్తే గెలిచిపోతామనే నమ్మకానికి గండి పడింది.

పారని పథకాలు

లబ్ధిదారులు కారుకు ఓట్లేయట్లేదు

నిన్న దుబ్బాకలో.. నేడు గ్రేటర్‌లో

రైతుబంధు, కల్యాణలక్ష్మి.. స్కీంలెన్నో

సగంమంది ఓట్లేసినా గెలవాల్సిందే

2018 మ్యాజిక్‌ రెండేళ్లకే మాయం

 

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఎన్నికల మంత్రదండంలో మహత్తు పోయింది. పథకాల పేరుతో లక్షల మందికి వేల కోట్లు కుమ్మరిస్తే గెలిచిపోతామనే నమ్మకానికి గండి పడింది. నిన్న దుబ్బాకలోనూ, నేడు గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ తమను గట్టెక్కిస్తాయని ఎంతో నమ్మకం పెట్టుకున్న పథకాలు అధికార పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. నిజానికి ఈ మంత్రదండమే 2018 శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు తిరుగులేని విజయాన్ని సమకూర్చింది. ఆ నమ్మకంతోనే కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతకష్టమైనా ఓటర్లకు నేరుగా లబ్ధి కలిగించే పథకాలను కొనసాగిస్తూనే ఉంది. అయితే, రెండేళ్లలోనే పరిస్థితి మారింది.


నిన్నటిదాకా కేసీఆర్‌ మాత్రమే ఇచ్చాడు అనుకున్న ఓటర్లు ఇప్పుడా పథకాలకు ప్రాధాన్యమివ్వడం లేదని తాజా ఫలితాలు తెలియజేస్తున్నాయి. దుబ్బాకలో పెన్షన్లు 57,815 మందికి ఇస్తే రైతు బంధు కింద 76,312 మందికి లబ్ధి కలిగింది. ఇవికాక కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్ల వంటి పథకాల కింద లబ్ధి పొందిన వాళ్లు వేలల్లోనే ఉన్నారు. ఇవన్నీ లెక్కేసుకొని, 2018 ఎన్నికల తరహాలో దుబ్బాకలో చరిత్ర సృష్టిస్తామని టీఆర్‌ఎస్‌ గట్టి నమ్మకంతో ఉంది. కానీ, ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 62 వేలు. అంటే, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వాళ్లలో సగం మందికూడా ఓటేయలేదన్నమాట. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎ్‌సకు ఇలాంటి చేదు అనుభవమే మిగిలింది.


నగరంలో ఎన్నికల ముందు రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించిన పథకాలతో దాదాపు 20 లక్షల కుటుంబాలకు వ్యక్తిగతంగా లబ్ధి కలిగింది. ఇంతాచేసి నగరంలో ఆ పార్టీకి పడిన ఓట్లు 11 లక్షల్లోపే. వరద బాధితులకు ఒకొక్కరికీ రూ.10 వేల చొప్పున 6.64 లక్షల కుటుంబాలకు రూ.664 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ పథకాన్ని కూడా ప్రకటించింది. దీంతో ఏకంగా 11 లక్షల మందికి మేలు జరుగనుందని ప్రభుత్వమే అంచనా వేసింది. ఆస్తి పన్ను కట్టని వారికి 50 శాతం రాయితీ, ఇప్పటికే కట్టి ఉంటే వచ్చే ఏడాది పన్నులో 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.


నెలకు 20 వేల లీటర్లలోపు నీటిని వినియోగించే వారి సంఖ్య 2 లక్షల దాకా ఉంటారని ప్రభుత్వం లెక్కకట్టింది. వీరు కుటుంబాలతో కలుపుకొని 10 లక్షల మంది దాకా ఉంటారు. వీరి ఆశీస్సులు కూడా ప్రభుత్వానికి అందలేదు. వృద్ధాప్య పెన్షన్లు, షాదీ ముబారక్‌ పథకాల సంగతి సరేసరి. నగరంలో ఈ పథకం లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. ఇక సెలూన్లు, ల్యాండ్రీలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రభుత్వం ఆఫర్‌ చేసింది. అయితే వీరి సంఖ్య గ్రేటర్‌లో  లక్ష దాకా ఉంటుంది. కుటుంబాలతో కలుపుకొని 2.5 లక్షల మంది ఉంటారు. వీరు కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవ హరించినట్లు తెలుస్తోంది.


Read more