నాలుగు రోజుల్లోపు తక్షణ సాయం
ABN , First Publish Date - 2020-10-21T09:59:48+05:30 IST
ఊహించని విపత్తుతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 నుంచి 4 లక్షల కుటుంబాలు నష్టపోయాయని ప్రభుత్వం అంచనా వేసింది.

పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకూ తొలుత 10 వేలు
పంపిణీకి ఆధార్, ఫొటో, సంతకం
అద్దెదారులకు మొండిచేయి.. చాలాచోట్ల సాయం తీసుకుంటున్న యజమానులు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఊహించని విపత్తుతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 నుంచి 4 లక్షల కుటుంబాలు నష్టపోయాయని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరికీ ఈనెల 24లోపు తక్షణ సాయం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రకృతి విపత్తుతో నీట మునిగిన ప్రతి ఇంటికి రూ.10 వేలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.50 వేలు, పూర్తిగా నేలమట్టమైన గృహానికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు కూడా తక్షణ సాయంగా రూ.10 వేలు ఇస్తున్నారు. బాధితులందరికీ మంగళవారం నుంచే సాయం పంపిణీ ప్రారంభించారు. బాధితుల ఆధార్, ఓటరు కార్డు ఆధారంగా నగదు అందజేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం తొలుత మంత్రి కేటీఆర్ సందర్శించిన ప్రాంతాల్లోని ప్రజలకు పరిహారం పంపిణీ చేశారు.
తర్వాత డివిజన్ల వారీగా అధికారులు పర్యటిస్తూ సాయం అందజేస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో త్రిసభ్య కమిటీతో ఏర్పడిన అధికారుల బృందం పర్యటిస్తూ సాయం అందజేస్తోంది. జీహెచ్‌ఎంసీ, మునిసిపాలిటీకి చెందిన ఇద్దరు ట్యాక్స్ ఆఫీసర్లు, రెవెన్యూ శాఖలోని ఆర్‌ఐ లేకుంటే వీఆర్వో బృందంలో ఉన్నారు. పరిహారం పంపిణీ సమయంలో బాధితుడి ఆధార్ కార్డుతోపాటు అతడి ఫొటో, రిజిస్టర్‌లో సంతకం తీసుకుంటున్నారు. నీటి ముంపులోని ఇంటి ఫొటో తీసుకుని జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. తక్షణ సాయం పంపిణీ తర్వాత పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. వర్షానికి ఏమేరకు నష్టం వాటిల్లిందనే దానిని పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం ఇవ్వనున్నారు.
వార్డులవారీగా అధికారులు
భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త, సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో డివిజన్ ముంపు ప్రాంతాల బాధ్యతను ఒక్కో అధికారికి అప్పగించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఒకటి, రెండు అంతకంటే పై అంతస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించడం వీరి బాధ్యత.
మేమేం పాపం చేశాం?
వరద సాయం అందిస్తున్న క్రమంలో పలు ప్రాంతాల్లో వాదులాటలు, ఆగ్రహావేశాలు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బాధితులకు పరిహారం ఇస్తున్నప్పటికీ, పైన రెండు, మూడు అంతస్తుల్లోని ప్రజలకు సాయం చేయడం లేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాగా, పలు ప్రాంతాల్లో అద్దెకు నివాసముంటున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పరిహారం మీరు తీసుకోవద్దని, అవి తమకే కావాలని అద్దెకు ఉంటున్న వారిని యజమానులు బెదిరిస్తున్నారు. ఇక, చాలామంది నీటమునిగిన ఇళ్లకు తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. అధికారులు ఆ ఇళ్లకు ‘డోర్ లాక్’ అని రాసుకుంటూ వెళ్తున్నారు.