అమీన్‌పూర్ చెరువులపై అక్రమ కట్టడాలు 881
ABN , First Publish Date - 2020-12-10T08:02:53+05:30 IST
హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లోని 12 చెరువులపై 881 అక్రమ కట్టడాలు నిర్మించినట్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు ప్రభుత్వం నివేదించింది. తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్-2002లోని సెక్షన్ 23 ప్రకారం 561 కట్టడాలకు నోటీసులు జారీ చేశామని పేర్కొంది. మిగతా 320 కట్టడాల యాజమానుల

561 కట్టడాలకు నోటీసులు జారీ
మిగతా వాటికీ త్వరలో నోటిసులిస్తాం
12 చెరువుల్లోని నిర్మాణాలను కూల్చేస్తాం
ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు
ఎన్జీటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లోని 12 చెరువులపై 881 అక్రమ కట్టడాలు నిర్మించినట్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు ప్రభుత్వం నివేదించింది. తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్-2002లోని సెక్షన్ 23 ప్రకారం 561 కట్టడాలకు నోటీసులు జారీ చేశామని పేర్కొంది. మిగతా 320 కట్టడాల యాజమానుల పేర్లు, చిరునామాలు అందుబాటులో లేవని, త్వరలోనే వారికీ నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. అమీన్‌పూర్ చెరువుల ఆక్రమణలపై ఎన్జీటీలో హ్యూమన్‌రైట్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ గత ఏడాది పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఒక కమిటీ వేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని ఎన్జీటీ ఈ ఏడాది జనవరిలో ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం నివేదిక సమర్పించారు. అమీన్‌పూర్ పరిధిలోని 14 చెరువుల్లో పుల్ ట్యాంక్ లెవల్ (ఎ్‌ఫటీఎల్) సర్వే నిర్వహించామని వివరించారు. కుమ్మరికుంట, కుంటశిఖం చెరువుల భూములు ఆక్రమణలకు గురికాలేదని పేర్కొన్నారు. మిగతా 12 చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను త్వరలోనే కూల్చివేస్తామని నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఎఫ్‌టీఎల్ పరిధి వరకు ఫెన్సింగ్ వేస్తున్నామని వివరించారు. రెవెన్యూ, నీటిపారుదల, మునిసిపాలిటీ, హెచ్‌ఎండీఏ, పోలీసు అధికారులతో చెరువుల రక్షణ కమిటీలు వేశామని తెలిపారు. తహసీల్దార్‌ను పాయింట్ పర్సన్‌గా, ఆర్‌ఐని పర్యవేక్షణాధికారిగా నియమించామని నివేదించారు.
నిబంధనలకు విరుద్ధంగా చెరువులపై అక్రమ కట్టడాలకు అనుమతులు మంజూరు చేసిన పంచాయతీ కార్యదర్శులు దేవదాస్, వసంతిని సస్పెండ్ చేశామని, మరో ఇద్దరు కార్యదర్శులు కాశీనాథ్, సోమనారాయణకు చార్జీ మోమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా అమీన్‌పూర్‌లోని చెరువులకు రూ.5 కోట్లను కేటాయించినట్లు వివరించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలపై సంగారెడ్డి కలెక్టర్, హెచ్‌ఎండీఏ కమిషనర్, మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్‌లతో కమిటీ వేశామని, ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని సీఎస్ తెలిపారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పెద్దచెరువుసుమారు 500 ఏళ్ల క్రితం ఇబ్రహీం కుతూబ్‌షాహీ కాలంలో నిర్మించారు. 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు.. కాలానుగుణంగా ఆక్రమణలతో ప్రస్తుతం కేవలం 93 ఎకరాలకు పరిమితమైంది. చెరువులో ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికారులు సర్వేలకే పరిమితయ్యారనే విమర్శలున్నాయి. ఎఫ్‌టీఎల్ హద్దుల పరిధిలో ఇప్పటికే పెద్ద ఎత్తున నిర్మాణాలు వచ్చాయి.
హెచ్‌ఎండీఏ జారీ చేసిన తుది నోటిఫికేషన్ ప్రకారం.. సర్వే నంబర్ 178లో 8.24 ఎకరాల ఎఫ్‌టీఎల్, 1.27ఎకరాలు బఫర్‌జోన్, 179 సర్వే నంబర్‌లో 7 గుంటల ఎఫ్‌టీఎల్, 29 గుంటల బఫర్‌జోన్, 180 సర్వే నంబర్‌లో 18 గుంటల ఎఫ్‌టీఎల్, 35 గుంటల బఫర్‌జోన్, 181సర్వే నంబర్‌లో 1.26 ఎకరాల ఎఫ్‌టీఎల్, 7 గుంటల బఫర్‌జోన్ పరిధిలోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. అయినా ఈ సర్వే నంబర్లలో ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎఫ్‌టీఎల్‌గా పేర్కొన్న చెరువు స్థలంలో వందల ట్రిప్పుల్లో మొరం, బండరాళ్లు తెచ్చి పూడ్చివేస్తున్నా స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అధికారులు అడ్డుకోలేదు. ఫలితంగా ఎకరాల కొద్ది ఎఫ్‌టీఎల్ స్థలం పూడ్చివేతకు గురైంది. ఇక్కడ మునిసిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇస్తున్నారు.