గెలిస్తే.. గెలవాలి!

ABN , First Publish Date - 2020-10-28T06:48:19+05:30 IST

గతంలో ఎన్నడూలేని విధంగా ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీ దూకుడు ప్రదర్శించడానికి కారణం ఏంటి? అధికార

గెలిస్తే.. గెలవాలి!

లేదంటే.. రెండవ స్థానంలో నిలవాలి

దుబ్బాకలో కాంగ్రెస్‌,  బీజేపీ దూకుడు వెనుక అంతరార్థం ఇదేనా?

రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూలేని విధంగా ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీ దూకుడు ప్రదర్శించడానికి కారణం ఏంటి? అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సభ్యుడు అకాల మరణంతో ఖాళీ ఏర్పడ్డ దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా దేనికి మోహరించారు? బీజేపీ తరఫున కేంద్ర మంత్రి సహా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దుబ్బాకపై పూర్తి స్థాయిలో ఎందుకు దృష్టి సారించారు? అనే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘గెలిస్తే.. గెలవాలి! లేదంటే, రెండవ స్థానంలో నిలవాలి’ అనే పట్టుదల అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండింటిలోనూ కనిపిస్తుండటం అందుకు కారణమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.



తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణాల్లో వస్తున్న తేడాలే కాంగ్రెస్‌, బీజేపీ వైఖరిలో తాజా మార్పునకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపొందటం ద్వారా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగా, కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. బీజేపీ ఐదుగురు ఎమ్మెల్యేలకే పరిమితమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలం మరింతగా పెరిగి రెండవసారి అధికారంలోకి వచ్చింది. స్థానాలు తగ్గినప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్‌ నిలుపుకుంది. బీజేపీ ఒకే ఒక్క ఎమ్మెల్యేతో అసెంబ్లీలో ఉనికి కాపాడుకోగలిగింది.




అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, అందులో తొమ్మిది స్థానాలు టీఆర్‌ఎస్‌, ఆ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం ఒక స్థానంలో గెలిచింది. బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలోకి దూసుకొచ్చింది. కాంగ్రెస్‌ మూడు స్థానాలతో మూడవ స్థానానికి దిగజారింది. ఈ పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీకి ఆందోళన కలిగిస్తే, సహజంగానే బీజేపీకి ఊపునిచ్చింది. అప్పటి నుంచే రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకి ప్రత్యామ్నాయం తామేననే వాదనను కమలనాథులు బలంగా వినిపిస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఒక్కటిగా పని చేయాల్సిన అనివార్యత ఏర్పడింది.


2019లో జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలోనూ ఈ రెండు పార్టీలు గట్టిగా కొట్లాడాయి. ఈ ప్రయత్నంలో కమలనాథులకు డిపాజిట్‌ కూడా దక్కలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ సిటింగ్‌ స్థానం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరింది. ఇక తాజాగా ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాక టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ స్థానమైనా.. కాంగ్రెస్‌, బీజేపీ తమ శక్తియుక్తులన్నింటినీ ప్రయోగిస్తుండటం ఆసక్తి రేకిత్తిస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా గెలుపు తమ లక్ష్యం అని బయటికి చెబుతున్నాయి. కానీ, అంతర్గతంగా మాత్రం ఒకవేళ ఓటమి ఎదురైతే, అది గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాయి. తాము ఓడిపోతే, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రెండవ స్థానంలోకి రావద్దని, తమ తర్వాత ఆ పార్టీ మూడవ స్థానంలో ఉండాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. బీజేపీ నేతల ఆలోచన కూడా  అలాగే ఉంది. అంతేకాక టీఆర్‌ఎస్‌ చేతిలో ఓడిపోతే, ఆ పార్టీ అభ్యర్థికి, తమకు మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉండాలని కూడా కాంగ్రెస్‌, బీజేపీ కోరుకుంటున్నాయి.


టీఆర్‌ఎస్‌ గెలిచినప్పటికీ, 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ మెజారిటీ రావాలని, ఆ ఎన్నికలతో పోల్చితే, తమకు ఎక్కువ ఓట్లు రావాలని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓడిపోతే, రెండవ స్థానంలో ఉండాలని ఎవరికి వారు ఆశిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించక బీజేపీ రెండవ స్థానంలో నిలిచినప్పటికీ, టీఆర్‌ఎ్‌సకి ఆ పార్టీకి మధ్య ఓట్ల తేడా ఎక్కువగా ఉండాలని, బీజేపీ అభ్యర్థికితమకు మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉం డాలని కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు. బీజేపీ నేతలు కూ డా ఇదే రకమైన ఆలోచన చేస్తున్నారు. ‘‘టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇబ్బంది లేదు. అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్‌తో సిటింగ్‌ సీటును నిలుపుకుందని చెప్పే అవకాశం మాకుంటుంది.


కానీ, మమ్మల్ని మూడవ స్థానానికి పరిమితం చేసి, బీజేపీ రెండవ స్థానానికి ఎగబాకితే రాజకీయంగా నష్టమే’’ అని కాంగ్రెస్‌ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ‘‘బీజేపీ గెలుపు కోసమే పోరాడు తున్నాం. టీఆర్‌ఎస్‌ ధాటికి విజయం సాధించలేకపోతే, రెం డవ స్థానం దక్కినా చాలు. కాంగ్రె్‌సను మూడవ స్థానంలోకి నెట్టేయాలనే మా లక్ష్యం నెరవేరినట్టే!’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-10-28T06:48:19+05:30 IST