మనం బాగుపడాలంటే.. మనకు మనమే మేలుకోవాలి: కేసీఆర్
ABN , First Publish Date - 2020-06-25T20:25:35+05:30 IST
చాలా సందర్భాల్లో తాను స్వయంగా తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డికి కారులో తిరిగానని...

మెదక్: చాలా సందర్భాల్లో తాను స్వయంగా తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డికి కారులో తిరిగానని, 1985లో కూడా తిరిగానని.. రోజూ ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరిగేవని సీఎం కేసీఆర్ అన్నారు. ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని గురువారం మెదక్ జిల్లాలో ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఆ అడవంతా పోయి 48 డిగ్రీల ఎండ వచ్చిందన్నారు. పాత మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఖచ్చితంగా వర్షం పడేదని, ఇప్పుడు ఇక్కడే కరువు వచ్చిందన్నారు. అడవులను మనమే మళ్లీ పెంచాలని, మనం బాగుపడాలంటే మనకు మనమే మేలుకోవాలని.. వేరే మార్గమే లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మనం మొండిపట్టు పట్టి.. నర్సాపూర్ అడవి తిరిగి రావాలన్నారు.
మొక్కలు పెంచడం ఆటవీ శాఖ పని కాధు..
మొక్కలు పెంచడం ఆటవీ శాఖ పని కాధని, మనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. డబ్బులు మనకు సమస్యే కాదన్నారు. తెలంగాణకు ఆద్భుతమైన ఆర్థిక వ్యవస్థ ఉందని, మంచి అధికారులు ఉన్నారని, అందరూ కలిసి మొక్కలు పెంచాలని సీఎం పిలుపు ఇచ్చారు. తెలంగాణ వంద శాతం ధనిక రాష్ట్రమని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఎవడో సన్నాసి విమర్శలు చేస్తే పట్టించుకోమన్నారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని ఎవరైనా అనుకున్నారా? సక్సెస్ అయింది కదా అని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బయటికి వెళ్లితే బిందెల ప్రదర్శన కనిపించేదని... ఇవాళ బిందెలు బయట కనబడుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. సబ్ స్టేషన్లు రావాలంటే గగనముండే... ఇప్పుడు బిస్కెట్ల లెక్కన సబ్ స్టేషన్లు ఇచ్చామన్నారు.
కాళేశ్వరం నీరు ఏడాదిలోగా నర్సాపూర్ దాటి సంగారెడ్డి వరకు పోతుందని, యాసంగిలో కూడా వానలు లేకున్నా పంటలు వేయవచ్చునని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యపేటలో నీటి కరువుండే.. తాను పోయిన ప్రతి సారి నీళ్ల కోసం అడిగే వారని, ఇప్పుడు నీళ్లు వచ్చాయని, తనను చెండులాగ ఎగురవేశారన్నారు. మనం ఎంత సంపాదించినా ముందు తరాలకు బతకగలిగే పరిస్థితి ఉండాలన్నారు. మన తాతలు ఎన్నో తరాలు పని చేస్తేనే మనం ఇలాగున్నామన్నారు. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటకు హరితహారం పెట్టానని, పది వేల మొక్కలకు తలలు పట్టుకున్నామన్నారు. తెలంగాణ అడవులను కలప దొంగలకు అప్పగిచారని, గతంలో..వాళ్లు పట్ఠుబడ్డరని చెప్పారు. అయితే వాళ్లు ఎవరో చెప్పనన్నారు. కలప దొంగలపై ఇంటలిజెన్స్ నిఘా పెట్టామన్నారు. ఇవాళ ప్రతి ఊరిలో నర్సరీ, ట్యాంకర్ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, తండాలు పంచాయతీలు చేయాలని కోరితే మనమే చేశామని, ఏ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. కమిట్ మెంట్ ఎక్కడికక్కడే జరగాలన్నారు. పైన ఉన్నోడి దమాక్ బాగుంటే కిందోని దమాక్ బాగుంటదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.