అవసరమైతే.. 3 కోట్ల మందికి టీకాలు

ABN , First Publish Date - 2020-12-19T07:39:10+05:30 IST

రాష్ట్రంలో తొలుత 80 లక్షల మందికే కరోనా వ్యాక్సినేషన్‌ చేయాలని భావించినప్పటికీ.. ఇప్పుడు ఆ అంచనా మారింది. అవసరమైతే 3

అవసరమైతే.. 3 కోట్ల మందికి టీకాలు

సన్నాహాలు చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ

కేంద్రం ఆదేశాలతో అత్యవసర ఏర్పాట్లు

రూ.11 కోట్లతో కోల్డ్‌ చైన్‌ వ్యవస్థ 

వ్యాక్సిన్ల నిల్వ సామర్థ్యం 684 క్యూబిక్‌ మీటర్లకు పెంచేందుకు కసరత్తు 

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలుత 80 లక్షల మందికే కరోనా వ్యాక్సినేషన్‌ చేయాలని భావించినప్పటికీ.. ఇప్పుడు ఆ అంచనా మారింది. అవసరమైతే 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాన్ని కోరింది. దీంతో అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, శీతల గిడ్డంగుల వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సర్కారు మరింత వేగవంతం చేసింది.


తెలంగాణలో దాదాపు 4.5 కోట్ల జనాభా ఉంది. అందులో 20 శాతం మందికి ఇప్పటికే కరోనా సోకి ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే 15 ఏళ్లలోపు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. దీంతో మరో 3 కోట్ల మంది మిగులుతారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ వేసే విధంగా సిద్ధం కావాలని చెప్పడంతో అందుకు తగ్గట్లు రాష్ట్రం సన్నాహాలు చేస్తోంది.


తెలంగాణలో ఇప్పటికే 14 రకాల వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకోసం 160 క్యూబిక్‌ మీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగులు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ల నిల్వ కోసం వాటి సామర్థ్యాన్ని ఏకంగా 684 క్యూబిక్‌ మీటర్లకు పెంచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాల్లో 400 క్యూబిక్‌ మీటర్లు, హైదరాబాద్‌లో 284 క్యూబిక్‌ మీటర్ల స్టోరేజీ ఉండేలా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మొత్తం రూ.11 కోట్లను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఖర్చుపెడుతోంది.


వ్యాక్సినేషన్‌ కోసం రెగ్యులర్‌గా వాడే సిరంజీలు కాకుండా ఆటో డిజేబుల్‌ సిరంజీ (ఏడీ సిరంజ్‌)లను తెప్పిస్తున్నారు. మొత్తం మూడు కోట్ల ఏడీ సిరంజీలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిలో ఇప్పటికే కొన్ని స్టోరేజీ పాయింట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఈ సిరంజీలు ఒక్కసారి వాడితే రెండోసారి వాడేందుకు పనికిరావన్నారు. 


22లోగా శిక్షణ పూర్తి

తెలంగాణలో ప్రస్తుతం 9157 మంది ఏఎన్‌ఎం (ఆక్సిలరీ మిడ్‌వైఫరీ నర్స్‌)లు ఉన్నారు. అంటే రాష్ట్రంలో ప్రతి లక్షమంది ప్రజలకు 23 మంది ఏఎన్‌ఎంలు ఉన్నారు. దేశంలో ఏపీ తర్వాత అత్యధికంగా ఏఎన్‌ఎంలు ఉన్నది ఇక్కడే. వీరందరి సేవలను వ్యాక్సినేషన్‌ కోసం విస్తృతంగా వినియోగించుకోనున్నారు. మొత్తం 10వేల కేంద్రాల ద్వారా ఒక్కో కేంద్రంలో 100 మందికి చొప్పున కనీసం పది లక్షల మందికి రోజూ వ్యాక్సినేషన్‌ చేయనున్నారు. ఈ లెక్కన నెల రోజుల వ్యవధిలో కేంద్రం సూచించే 3 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలని యోచిస్తున్నారు.


మొదటి డోసు వేయించుకున్న వారికి నాలుగు వారాల తర్వాత రెండో డోసును అందిస్తారు. దీంతో 60 రోజుల వ్యవఽధిలో మూడుకోట్ల మందికి ఆరు కోట్ల డోసులను వేస్తామని ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లాస్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ఈనెల 22లోగా టీకాలకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. 
కోల్డ్‌ చైన్‌ వ్యవస్థ కోసం వాడే యంత్రాలు


వాకిన్‌ కూలర్స్‌ 3

వాకిన్‌ ఫ్రీజర్స్‌ 2

ఐఎల్‌ఆర్‌-ఐ్‌సలైన్డ్‌ 

రిఫ్రిజిరేటర్లు 422

డీప్‌ ఫ్రిజ్‌ 58


ప్రస్తుత వ్యాక్సినేషన్‌ లక్ష్యం 

లక్ష్యిత ప్రజలు

50 ప్లస్‌, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు(18-49)

74,67,843


అవసరమయ్యే డోసులు

(10% వేస్టేజీ కలుపుకొని)

1,65,78,611రాష్ట్రంలో కొత్తగా 551 కేసులు


రాష్ట్రంలో గురువారం మరో 551 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో కొత్తగా ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 2,80,195కు, మరణాలు 1,506కు పెరిగాయి.  మరోవైపు తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సంఖ్య 1.70 లక్షలకు చేరింది. 

Read more