ముగిసిన మూడో విడత ఐసీఎంఆర్‌ సర్వే

ABN , First Publish Date - 2020-12-31T04:06:11+05:30 IST

ముగిసిన మూడో విడత ఐసీఎంఆర్‌ సర్వే

ముగిసిన మూడో విడత ఐసీఎంఆర్‌ సర్వే

జనగామ జిల్లాలో 400 రక్త నమూనాల సేకరణ

జనగామ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఐసీఎంఆర్‌ నిర్వహించిన మూడో విడత సర్వే జిల్లాలో బుధవారం ముగిసింది. కరోనా సామూహిక వ్యాప్తి ఎలా ఉంది, ప్రజల యాంటీ బాడీస్‌ డెవలప్‌మెంట్‌, రోగనిరోధక శక్తి తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు భారత వైద్య పరిశోధన సంస్థ(ఐసీఎంఆర్‌), జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సంయుక్తంగా సర్వే నిర్వహించింది. జిల్లాలో మొదటి, రెండో విడత సర్వేలను గతంలో నిర్వహించి నివేదికలను విడుదల చేసిన ఐసీఎంఆర్‌ మూడో విడత సర్వేనూ పూర్తి చేసి రక్త నమూనాలను చెన్నైలోని ల్యాబ్‌కు పంపించింది. జిల్లాలో మూడు రోజుల్లో జరిగిన సర్వేలో ఐసీఎంఆర్‌ అధికారులు అర్లప్ప, సంతోష్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారుల బృందం ఐదు బృందాలుగా ఏర్పడి ప్రజల నుంచి రక్త నమూనాలను సేకరించారు. జిల్లావ్యాప్తంగా 10 మండలాలను అధికారులు ఎంపిక చేసుకున్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకొని గ్రామానికి 40 లెక్కన 400 శాంపిళ్లను సేకరించారు. జనగామ పట్టణంలోని 2వ వార్డు, బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు, లింగాలఘనపురం మండలంలోని కళ్లెం, దేవరుప్పుల మండలంలోని మాధాపురం, నర్మెట్ట మండలంలోని హన్మంతాపూర్‌, చిల్పూరు మండలంలోని మల్కాపూర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి, జఫర్‌ఘడ్‌, పాలకుర్తి మండలంలోని మంచుప్పుల, కొడకండ్లలోని పీహెచ్‌సీలలో నమూనాలను సేకరించారు. వాటిని చెన్నైలోని ఐసీఎంఆర్‌ ల్యాబ్‌లో పరీక్షించిన అనంతరం నివేదికను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు పంపిస్తామన్నారు. పరీక్షల అనంతరం కరోనా సామూహిక వ్యాప్తి, ప్రజల రోగ నిరోధక శక్తిపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఐసీఎంఆర్‌ అధికారులు అర్లప్ప, సంతోష్‌కుమార్‌ తెలిపారు. 


Updated Date - 2020-12-31T04:06:11+05:30 IST