కేసు బలంగా పెట్టాను, డబ్బులివ్వు!
ABN , First Publish Date - 2020-12-15T08:14:31+05:30 IST
‘‘నీ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు బలంగా పెట్టాను. నాకు రూ. 6వేలు ఇవ్వు’’. ఇదీ.. యాదాద్రి జిల్లా గుండాల ఏఎ్‌సఐ,

గుండాల ఏఎ్‌సఐ ఆడియో వైరల్
గుండాల, డిసెంబరు 14: ‘‘నీ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు బలంగా పెట్టాను. నాకు రూ. 6వేలు ఇవ్వు’’. ఇదీ.. యాదాద్రి జిల్లా గుండాల ఏఎ్‌సఐ, ఓ బాధితుడి వద్ద చేసిన డిమాండ్. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. బాధితుడి కథనం ప్రకారం.. గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి చెందిన మట్టగజం యాకయ్యపై ఈ నెల 11న అతడి సోదరులు రమేశ్, అంజయ్యలు కర్రలతో దాడి చేశారు. వారిపై యాకయ్య అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏఎ్‌సఐ భిక్షం, ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని, అక్కడి నివేదిక తీసుకురావాలని సూచించాడు. మరుసటి రోజు బాధితుడికి ఏఎ్‌సఐ ఫోన్ చేశాడు.
‘‘ఆస్పత్రి రిపోర్టు తెచ్చావా? రెండు మూడు పెద్ద సెక్షన్లు పెడుతున్నాను. రూ.6 వేలు ఇవ్వు’’ అని డిమాండ్ చేశాడు. ఆదివారం ఉదయం యాకయ్య వద్దకు వెళ్లిన భిక్షం, మరోసారి డబ్బులు అడిగారు. తన దగ్గర రూ.వెయ్యి మాత్రమే ఉన్నాయని చెప్పడంతో ఆ వెయ్యి తీసుకుని, మిగిలిన డబ్బు కూడా తీసుకురా అంటూ బెదిరించాడు.
అంతేకాక.. నిందితుల్లో ఒకరైన రమేశ్ ఫిర్యాదు మేరకు యాకయ్యపైన కూడా కేసు పెట్టాడు. దీంతో.. భిక్షం ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశానని యాకయ్య తెలిపారు. అది వైరల్‌గా మారడంతో.. గుండాల సీఐ స్పందించారు. భిక్షంపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.