కలుషిత జలాల నివారణకు పనులు మొదలు
ABN , First Publish Date - 2020-07-10T09:19:39+05:30 IST
కలుషిత జలాల నివారణకు పనులు మొదలు

జలమండలి ఉన్నతాధికారుల సందర్శన
ఉప్పల్,జూలై9(ఆంధ్రజ్యోతి): ఉప్పల్ ఓల్డ్ విలేజ్ భరత్‌నగర్ మాలబస్తీలో గత నెల రోజులుగా జల మండలి సరఫరా చేసే మంచి నీటిలో డ్రైనేజీ మురుగు నీరు కలుస్తుండడంతో ఆ బస్తీ వాసులు పడుతున్న ఇబ్బందులపై ‘తాగు నీరే విషమైంది’ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనం జలమండలి అధికారుల్లో కదలిక తెచ్చింది. నెల రోజులుగా ప్రజలు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఈ కథనాన్ని చూసి స్పందించారు. గురువారం తెల్లవారుజామున ఉప్పల్ జలమండలి జీఎం జాన్ షరీఫ్, డీజీఎం శ్రీధర్‌రెడ్డి, ఏజీఎం సత్యనారాయణ తమ సిబ్బందితో రంగంలోకి దిగి భరత్‌నగర్ మాలబస్తీలో తాగు నీటి లైన్లలో మురుగు నీరు ఎక్కడెక్కడ కలుస్తోందో గుర్తించి మరమ్మతు పనులు మొదలుపెట్టారు. శుక్రవారం వరకు ఈ పనులు పూర్తి చేస్తామని జీఎం జాన్ షరీఫ్ తెలిపారు. దెబ్బతిన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూతలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయడంతోపాటు డ్రైనేజీ లైన్లకు మరమ్మతులు కూడా పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి పాత తాగు నీటి పైప్ లైన్ స్థానంలో కొత్త లైన్ వేసేందుకు గతంలో ప్రతిపాదనలు చేశామని, ఆ పనులకు వెంటనే నిధులు మంజూరయ్యేలా చూస్తానని జీఎం తెలిపారు.