చైనా వస్తువుల బహిష్కరణ : హైదరాబాదీ వ్యాపారుల సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-18T23:32:03+05:30 IST

నగరంలో అత్యంత కీలకమైన బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్‌ఖానా హోల్‌సేల్ వ్యాపారస్తులు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

చైనా వస్తువుల బహిష్కరణ : హైదరాబాదీ వ్యాపారుల సంచలన నిర్ణయం

హైదరాబాద్: నగరంలో అత్యంత కీలకమైన బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్‌ఖానా హోల్‌సేల్ వ్యాపారస్తులు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చైనా ఉత్పత్తులను ఏమాత్రం విక్రయించరాదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాల్వాన్ లోయలో భారత్ చైనా జవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందడంతో హైదరాబాదీ వ్యాపారులు ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్‌ఖానా ప్రాంతాల్లోని హోల్‌సేల్ వ్యాపారులు సమావేశమయ్యారు.


హైదరాబాద్ సిటీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకున్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా కట్టడిలో తమవంతు పాత్రను పోషించిన వారమవుతామని వారు ప్రకటించారు. మరోవైపు చైనా వస్తువులను బహిష్కరించాల్సిందేనని దేశవ్యాప్త డిమాండ్ ఉద్ధృతంగా తిరిగి ప్రచారంలోకి వచ్చింది.


గాల్వాన్ సంఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చైనా జెండాలను, చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్, భారత రైల్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లాంటివి ఇప్పటికే కాంట్రాక్టులు.. ఇతరత్రా వాటిలో చైనాను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-06-18T23:32:03+05:30 IST