వరల్డ్‌ రోబోటిక్స్‌ ఫెస్టివల్‌కు హైదరాబాద్ విద్యార్థి

ABN , First Publish Date - 2020-03-12T15:50:52+05:30 IST

అమెరికాలోని డెట్రాయిట్‌లో ఏప్రిల్‌ 29న జరగనున్న ఫస్ట్‌ లెగో-లీగ్‌ వరల్డ్‌ రోబోటిక్స్‌-ఫెస్టివల్‌

వరల్డ్‌ రోబోటిక్స్‌ ఫెస్టివల్‌కు హైదరాబాద్ విద్యార్థి

హైదరాబాద్ : అమెరికాలోని డెట్రాయిట్‌లో ఏప్రిల్‌ 29న జరగనున్న ఫస్ట్‌ లెగో-లీగ్‌ వరల్డ్‌ రోబోటిక్స్‌-ఫెస్టివల్‌ ఎక్స్‌పో(లండర్‌-9)లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి రాష్ట్రం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో  ఏఎస్‌రావునగర్‌కు చెందిన విద్యార్థి వంటేరు వేదాన్ష్‌రెడ్డి ఉన్నారు. ఏఎస్‌రావునగర్‌ కాలనీకి చెందిన వంటేరు చంద్రశేఖర్‌రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు వేదాన్ష్‌రెడ్డి యాప్రాల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చంద్రశేఖర్‌రెడ్డి నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా, జ్యోతి గృహిణి. వేదాన్ష్‌రెడ్డికి చిన్నతనం నుంచే సైంటిస్ట్‌ కావాలనే కోరిక ఉండడంతో అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు రెండేళ్లుగా ఏఎస్‌రావునగర్‌లోని రిసెర్చ్‌ రోబోటిక్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌లో అండర్‌-12 విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఇంటలెక్టాస్‌ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు. పాఠశాల సమయం ముగిసిన అనంతరం సాయంత్రం వేళ రెండు గంటల పాటు వేదాన్ష్‌రెడ్డి శిక్షణకు హాజరువుతున్నాడు. 


జనవరి 18న శంషాబాద్‌లో నిర్వహించిన ఆంధ్రా-తెలంగాణ ప్రాంతీయ స్థాయి పోటీలలో వేదాన్ష్‌రెడ్డి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఫిబ్రవరిలో చెన్నైలో నిర్వహించిన జాతీయ పోటీలలో ఎంపికై.. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే వరల్డ్‌ రోబోటిక్స్‌-ఫెస్టివల్‌ ఎక్స్‌పోలో పాల్గొనడానికి ఎంపికయ్యాడు. ఎక్స్‌పోలో వేదాన్ష్‌రెడ్డి వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి,  అందరికీ గృహ నిర్మాణానికి అవసరమయ్యే పరిష్కార మార్గాలను సూచించే కొత్త రోబోటిక్స్‌ మెషిన్లను ఆవిష్కరించి ప్రదర్శించనున్నారు.


భవిష్యత్‌లో పర్యావరణ పరిరక్షణకు రోబోటిక్స్‌ తరహా మెషిన్లు ఎంతో దోహదపడతాయని ఇంటలెక్టాస్‌ సంస్థ ప్రధాన కోచ్‌ విద్యా భాస్కర్‌ తెలిపారు. ఇస్రోలో ఉద్యోగం చేయాలని తమ కుమారుడు వేదాన్ష్‌రెడ్డి లక్ష్యంగా నిర్ణయించున్నాడని తల్లిదండ్రులు చంధ్రశేఖర్‌రెడ్డి-జ్యోతిరెడ్డిలు తెలిపారు. తమ కుమారుడు వేదాన్ష్‌రెడ్డి చిన్న వయస్సులోనే వరల్డ్‌ స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2020-03-12T15:50:52+05:30 IST