రెండు కుటుంబాల నుంచి హైదరాబాద్‌ విముక్తి పొందాలి

ABN , First Publish Date - 2020-11-25T08:13:48+05:30 IST

‘హైదరాబాద్‌ మహానగరం కేసీఆర్‌, ఒవైసీ అనే రెండు కుటుంబాల పాలనల నుంచి విముక్తి పొందినపుడే అభివృద్ధి చెందుతుంది’

రెండు కుటుంబాల నుంచి హైదరాబాద్‌ విముక్తి పొందాలి

మజ్లిస్‌ అభ్యర్థిని మేయర్‌గా చేయాలని టీఆర్‌ఎస్‌ యత్నం..

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

 రోడ్డుషోల్లో ధ్వజమెత్తిన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘హైదరాబాద్‌ మహానగరం కేసీఆర్‌, ఒవైసీ అనే రెండు కుటుంబాల పాలనల నుంచి విముక్తి పొందినపుడే అభివృద్ధి చెందుతుంది’ అని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, మల్కాజిగిరి, మౌలాలి ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్డుషోల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 67 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, మరి వరదల్లో 6 లక్షల 50 వేల ఇళ్లు ఎలా మునిగాయని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత  పాలిస్తున్న కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కిషన్‌రెడ్డి అన్నారు.

ఈసారి మజ్లిస్‌ అభ్యర్థికి మేయర్‌ పట్టం కట్టబెట్టాలని టీఆర్‌ఎస్‌ యత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఎలాంటి అభివృద్ధి సాధించలేదు కాని కేసీఆర్‌ ఫ్యామిలీ మాత్రం ఉపాధి పొందుతుందని విమర్శించారు. 


కమలదళానికి ‘సూర్యా’స్త్రం! 

లాక్యా సూర్యనారాయణ తేజస్వి.. మూడు పదుల వయస్సు గల, కన్నడ బీజేపీ ఎంపీ అయిన ఈ ఫైర్‌బ్రాండ్‌.. ప్రచారం యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. హిందీ, ఇంగ్లిష్‌ భాషల మిళితంగా సాగుతున్న ఈయన ప్రసంగాలు ఆకర్షిస్తున్నాయి. కాగా, ఉద్యమపార్టీ అని చెప్పుకొన్న టీఆర్‌ఎస్‌, పాతబస్తీలో ఎంఐఎంకు ఎక్కువ సీట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ సీనియర్‌ నేత పి. మురళీధర్‌రావు ఆరోపించారు. నక్సలైట్లు మాట్లాడే మాటలు కేటీఆర్‌ మాట్లాడుతున్నారని ఆరోపించారు. మేయర్‌ పీఠానికి సంబంధించి ఎంఐఎంకు మద్దతిస్తారో, తీసుకుంటారో టీఆర్‌ఎస్‌ చెప్పాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. 
కేసీఆర్‌, కేటీఆర్‌లు కమెడియన్లు

 ఎంపీ ధర్మపురి అరవింద్‌

రాష్ట్రంలో సినిమాలు బంద్‌ కావడంతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు తమ చర్యలతో కమెడియన్లుగా మారి మంచి వినోదాన్ని పంచుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఎద్దేవా చేశారు. వారు సినిమాల్లోకి వెళ్లి ఉంటే కేసీఆర్‌, ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందంకి, కేటీఆర్‌ బాబూమోహన్‌కి  గట్టిపోటీ ఇచ్చేవారని అన్నారు. సీఎం ఆఫీసుకు వెళ్తలేరు.. అని అందరంటుంటే, ఏకంగా సచివాలయాన్నే కేసీఆర్‌ కూలగొట్టించారని, ఇక రొటీన్‌ కార్యక్రమాలను కూడా మంత్రి కేటీఆర్‌ గొప్పగా చెప్పుకొంటున్నారని విమర్శించారు.


మంగళవారం రాష్ట్రపార్టీ కార్యాలయంలో, సోమాజిగూడ డివిజన్‌ బీజేపీ అభ్యర్ధి విజయదుర్గాయాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలోనూ ఆయన మాట్లాడారు. మూసీనదిలో తాను బోటింగ్‌ చేస్తుండగా కేసీఆర్‌, కేటీఆర్‌ ఎదురు పడినట్టుగా కలలు వస్తున్నాయని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గ్రేటర్‌లో బీజేపీ మేయర్‌ పీఠం సాధిస్తే.. వరద బాధితులకు రూ. 25 వేలు ఇస్తామని, అప్పుడు ఒక్కరే  డ్యాన్స్‌ చేస్తారా?దోస్తులు కూడా కావాల్నా అని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక కేటీఆర్‌ ఒక్క పరిశ్రమను కూడా హైదరాబాద్‌కు తీసుకురాలేకపోయారని, అబద్ధాలతో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను రూపొందించారని అరవింద్‌ విమర్శించారు. సచివాలయానికి కూడా వెళ్లని సీఎం కేసీఆర్‌, దేశానికి దిశ దశా చూపుతామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.


Read more