మీడియాపై ఖాకీల జులుం.. సీఎం కాదు.. పీఎం చెప్పినా వినం!

ABN , First Publish Date - 2020-03-24T21:02:37+05:30 IST

లాక్ డౌన్ నేపథ్యంలో మీడియా ప్రతినిధులను అడ్డుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే..

మీడియాపై ఖాకీల జులుం.. సీఎం కాదు.. పీఎం చెప్పినా వినం!

సంగారెడ్డి : లాక్ డౌన్ నేపథ్యంలో మీడియా ప్రతినిధులను అడ్డుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సీఎం మాటలను అస్సలు లెక్క చేయకుండా మీడియాపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. విధులకు వెళ్లే వారిని అడ్డగించి.. మీ చానెల్స్‌లో చూపిస్తున్నారు కదా తిరగకూడదని మీరెలా వెళ్తున్నారు..? అంటూ విలేకరులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నట్నుంచి ఇలాంటి ఘటనలు తెలంగాణలో చాలానే చోటుచేసుకున్నాయి. 


ఎవరు చెప్పినా వినం!

తాజాగా.. జహీరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుళ్లు ఓవరాక్షన్ చేశారు. మీడియా ప్రతినిధులను అడ్డుకున్న పోలీసులు వారిపై కన్నెర్రజేశారు. జర్నలిస్టులైతేనేం రోడ్లపై తిరగాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఒక్కటే.. జర్నలిస్టులకు సపరేట్‌గా రూల్స్ లేవు అంటూ వారిని అడ్డుకున్నారు. తాము రిపోర్టర్స్ అని.. విధులకు వెళ్లక తప్పక వెళ్లాల్సిందేనని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. అంతేకాదు.. సీఎం కేసీఆరే మీడియాను అడ్డుకోవద్దని చెప్పారు కదా అని వీడియో చూపించినప్పటికీ ‘సీఎం కాదు..పీఎం చెప్పినా వినబోం’ అని పోలీసులు చెబుతుండటం గమనార్హం.


కాగా.. సిటీ బయట నుంచి హైదరాబాద్‌కు వచ్చే మీడియా ప్రతినిధులు అయితే పోలీసులతో నానా ఇబ్బందులు పడుతున్నారు. సిటీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేసరికి ఐదారు చోట్ల ఇదే తంతు నడుస్తోంది. ఇక రాత్రి వేళల్లో అయితే విధులకు వస్తున్న మీడియావారిపై ఏకంగా లాఠీ ఝులిపిస్తున్నారు. అయితే పలు మీడియా సంస్థల అధిపతులు డీజీపీ, సీఎస్‌లకు ఫిర్యాదు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - 2020-03-24T21:02:37+05:30 IST