ప్రేమించిన అమ్మాయిని వేధిస్తున్నాడని...
ABN , First Publish Date - 2020-10-07T11:31:19+05:30 IST
ప్రేమించిన యువతిని తండ్రి వరుసైన వ్యక్తే వేధింపులకు గురిచేస్తున్నాడన్న కక్షతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అతడిని హత్య చేసి చెరువుకట్ట సమీపంలో

హైదరాబాద్ : ప్రేమించిన యువతిని తండ్రి వరుసైన వ్యక్తే వేధింపులకు గురిచేస్తున్నాడన్న కక్షతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అతడిని హత్య చేసి చెరువుకట్ట సమీపంలో పాతిపెట్టాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ పి.వి.పద్మజ వివరాలు వెల్లడించారు. కడపజిల్లాకు చెందిన మహిళ హౌజ్‌కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. ఈమెకు 14 సంవత్సరాల కుమార్తె ఉంది. మొదటి భర్త చనిపోవడంతో ఎల్లమ్మ ప్రాంతంలో ఉంటూ కిరాణా షాపులో పని చేసే వీరభద్రం (28)తో సహజీవనం సాగిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలంగా వీరభద్రం ఆ మహిళ మొదటి కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని తాను ప్రేమిస్తున్న కేబుల్ ఆపరేటర్ బాలుకి బాలిక చెప్పింది.
దీంతో బాలు తన బావ జి.మహేష్ (24)కు విషయం చెప్పాడు. గత నెల 16న పథకం ప్రకారం వీరభద్రాన్ని ఎల్లమ్మబండ సర్వేనెంబర్ 57కు పిలిపించి తన స్నేహితులైన మల్లేష్ (23), పుర్రా రాజు (38), చందు (23), యశ్వంత్ (20), ఖగేందర్ (19), ఐ.శ్రీనివాస్ (22), నాగరాజు, దినే్‌షలతో కలిసి మద్యం తాగించారు. కర్రలు, పైపులతో వీరభద్రాన్ని తీవ్రంగా కొట్టడంతో అక్కడే చనిపోయాడు. శవాన్ని ఆటోలో వికారాబాద్ ప్రాంతంలోని మహేష్ సొంతూరు అయిన మాదారం చెరువు సమీపంలో పూడ్చిపెట్టి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తన భర్త కనిపించడం లేదని 17వ తేదీన ఆ మహిళ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగించారు. వీరభద్రం హత్యకు గురైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు మాదారంలో మృతదేహాన్ని గుర్తించారు. నిందితులైన మహేష్, మల్లేష్, రాజు, చందు, యశ్వంత్, ఖగేందర్, శ్రీనివా్‌సలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాగరాజు, దినేష్ పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ పురుషోత్తం, సీఐ గంగారెడ్డి, డీఐ మహేష్ పాల్గొన్నారు.