కేరళ గోల్డ్‌ స్కామ్‌కు హైదరాబాద్‌ లింకులు!

ABN , First Publish Date - 2020-07-20T09:28:29+05:30 IST

దేశంలో ఎక్కడ ఏ స్కాం జరిగినా.. దాని మూలాలు ఏదో ఒక రూపంలో హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. కలకలం రేపిన కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుకు

కేరళ గోల్డ్‌ స్కామ్‌కు హైదరాబాద్‌ లింకులు!

  • హవాలా మార్గంలో దుబాయికి రూ. కోట్లు
  • దర్యాప్తు ముమ్మరం.. ముగ్గురి అరెస్టు


హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడ ఏ స్కాం జరిగినా.. దాని మూలాలు ఏదో ఒక రూపంలో హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. కలకలం రేపిన కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుకు కూడా తాజాగా నగరంతో లింకులు బయటపడ్డాయి. కస్టమ్స్‌ అధికారుల దర్యాప్తులో ఈ లింకులు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడి నుంచి హవాలా మార్గంలో కోట్ల రూపాయలు దుబాయికి తరలినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. ఆదివారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిందితుడు సందీప్‌ నాయర్‌తో పాటు ఐటీ విభాగం ఉద్యోగిని స్వప్నా సురేశ్‌ను అరెస్టు చేసింది. మరో నిందితుడు ఫైజల్‌ ఫరీద్‌ను దుబాయిలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఫైజల్‌పై ఎన్‌ఐఏ.. పోర్జరీ, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, స్మగ్లింగ్‌ తదితర అభియోగాలు మోపింది. త్వరలోనే అతడిని భారత్‌కు రప్పించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ స్కాంలో దర్యాప్తు సాగే కొద్దీ పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది వ్యవధిలో 300 కిలోలకు పైగా బంగారాన్ని నిందితులు వివిధ మార్గాల్లో అక్రమంగా తరలించారు. ఐటీ విభాగం ఉద్యోగిని స్వప్నా సురేశ్‌ సహకారంతో 2019 జూలైలో నిందితులు ఈ స్కాంకు తెరలేపారు. ఆమె సహకారంతోనే ఏడాది కాలంలో ఈ స్మగ్లింగ్‌ యథేచ్ఛగా సాగింది. కాగా.. ఈ స్కాంలో కేరళ సీఎం కార్యాలయ అధికారుల హస్తమున్నట్లు ఆరోపణలు రావడంతో.. ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐటీ సెక్రటరీలను తొలగించింది.

Updated Date - 2020-07-20T09:28:29+05:30 IST