వ్యాక్సిన్ రేసులో హైదరాబాదీ సంస్థ
ABN , First Publish Date - 2020-04-08T10:02:11+05:30 IST
రోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే దిశగా మరో హైదరాబాదీ పరిశోధనా సంస్థ దృష్టిసారించింది. 1982 నుంచి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్...

- ఆస్ట్రేలియా వర్సిటీతో ఐఐఎల్ జట్టు
- లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి ఒప్పందం
హైదరాబాద్, ఏప్రిల్ 7 : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే దిశగా మరో హైదరాబాదీ పరిశోధనా సంస్థ దృష్టిసారించింది. 1982 నుంచి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ వర్సిటీతో చేతులు కలిపింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కోడాన్ డీ-ఆప్టిమైజేషన్ టెక్నాలజీతో ‘లైవ్ అటెన్యుయేటెడ్’ రకానికి చెందిన కరోనా లీడ్ వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను తయారు చేయనున్నారు. జంతువులపై ప్రయోగ పరీక్షలు పూర్తయిన తర్వాత మనుషులపై ట్రయల్స్ కోసం వ్యాక్సిన్‌ను ఐఐఎల్‌కు బదిలీ చేస్తారు. అనంతరం భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) మార్గదర్శకాల మేరకు ఇక్కడ దశలవారీగా మనుషులపై ట్రయల్స్ నిర్వహించి పూర్తిస్థాయి వ్యాక్సిన్‌గా అభివృద్ధి చేస్తారు. ఐఐఎల్ అనేది నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మనుషులు, పశువుల రోగ నిరోధక వ్యాక్సిన్ల అతిపెద్ద ఉత్పత్తిదారుగా దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది.
లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అంటే..
ప్రయోగ పరీక్షల దశలో ‘లైవ్ అటెన్యుయేటెడ్’ రకం వ్యాక్సిన్లలో వైరస్‌ను సజీవంగానే ఉంచి, దాన్ని నిష్ర్కియాత్మకంగా మార్చేస్తారు. తొలుత ఆవులు, మేకలు, ఎలుకలు వంటి వాటిలోకి ప్రవేశపెట్టి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు.
ఏ మాత్రం హాని చేయని దశలో ఉన్న ‘లైవ్ అటెన్యుయేటెడ్’ వైరస్‌ను తిప్పికొట్టేందుకు ఆయా జంతువులు/పశువుల్లోని వ్యాధి నిరోధక వ్యవస్థలు ప్రతిరక్షకాల(యాంటీ బాడీస్)ను విడుదల చేసి రక్షణ పొందుతాయి. ఈ వైరస్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారీ బలమైన ప్రతిఘటన ఇవ్వడం ద్వారా, ఆ రోగకారకాన్ని సునాయాసంగా తుదముట్టించేలా వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. ఈ ట్రయల్స్‌లో వచ్చే ఫలితాలు పూర్తి సానుకూలంగా ఉన్నాయని భావిస్తే చివరగా మనుషులపై ప్రయోగ పరీక్షలు జరుపుతారు. ‘లైవ్ అటెన్యుయేటెడ్ వైరస్’లతో ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదు. వ్యాక్సిన్‌లో సజీవంగానే ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్ చేసే శక్తి వాటికి ఎంతమాత్రం ఉండదు.