గ్రేటర్‌లో కేసుల పెరుగుదలపై విజయశాంతి కొత్త అనుమానాలు
ABN , First Publish Date - 2020-05-13T19:09:01+05:30 IST
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ప్రశ్నించారు. ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించినా.. పాజిటివ్ కేసుల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయాలని ప్రభుత్వానికి సూచించారు. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజాన్ని ఒప్పుకోవాలని సూచించారు. అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారన్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నారని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు.
