నేడే తీగల వంతెన ప్రారంభం.. భారీ ఏర్పాట్లు..

ABN , First Publish Date - 2020-09-25T12:05:20+05:30 IST

ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారం.. పర్యాటక హబ్‌గా నిర్మించిన కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.

నేడే తీగల వంతెన ప్రారంభం.. భారీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారం.. పర్యాటక హబ్‌గా నిర్మించిన కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ప్రారంభోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారికంగా ప్రకటించింది. పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు వంతెనను ప్రారంభించనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీలు కే కేశవరావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, దానం నాగేందర్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ హాజరవుతారు.


జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వైపు నుంచి సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం దుర్గం చెరువు, రోడ్‌ నెంబర్‌ -45లో వంతెన నిర్మిస్తున్నారు. రూ.184 కోట్లతో దుర్గం చెరువుపై, రూ.150 కోట్లతో రోడ్‌ నెంబర్‌-45లో వంతెనల పనులు పూర్తయ్యాయి. జంట వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రోడ్‌ నెంబర్‌-45 నుంచి ఐటీ కారిడార్‌కు సులువైన ప్రయాణానికి అవకాశం కలగనుంది. కేటీఆర్‌ వంతెన పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పర్యాటక హంగులు అద్దేందుకు కీలక సూచనలు చేశారు.


వంతెన స్వరూపం...

మొత్తం పొడవు - 735.639 మీటర్లు

కేబుల్‌ పొడవు - 425.85 మీటర్లు

అప్రోచ్‌ వయా డక్ట్‌ పొడవు - 309.789 మీటర్లు

లేన్‌లు - 4

Updated Date - 2020-09-25T12:05:20+05:30 IST