రాజధానిలో వ్యాపారి కిడ్నాప్‌.. హత్య

ABN , First Publish Date - 2020-02-05T11:04:39+05:30 IST

ఫోన్‌కాల్‌ రాగానే బయటకు వెళ్లొస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిన ఆ చేపల వ్యాపారి మళ్లీ ఇంటికి రాలేదు. ఆయన సెల్‌ నుంచి ఇంట్లోవారికి ఫోన్‌ వచ్చినా..

రాజధానిలో వ్యాపారి కిడ్నాప్‌.. హత్య

టేపుతో కాళ్లు కట్టేసి.. గొంతు నులిమి ఘాతుకం
4 రోజుల తర్వాత కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యం
వదిలేయాలంటే 90 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌
30 లక్షలిస్తామన్న బాధిత కుటుంబం.. కిడ్నాప్‌ రోజే హత్య?

ఫోన్‌కాల్‌ రాగానే బయటకు వెళ్లొస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిన ఆ చేపల వ్యాపారి మళ్లీ ఇంటికి రాలేదు. ఆయన సెల్‌ నుంచి ఇంట్లోవారికి ఫోన్‌ వచ్చినా.. ఆయన బదులు మరొకరు మాట్లాడారు. తర్వాత రూ.90 లక్షలు ఇస్తేనే ఆయనను వదిలిపెడతామని మెసేజ్‌ పెట్టారు. అంత ఇచ్చుకోలేమని.. రూ.30 లక్షలు ఇస్తామని ఆయన కుటుంబీకులు ప్రాధేయపడ్డారు! తమ మాట వినలేదనో.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆగ్రహమో గానీ కిడ్నాప్‌ చేసిన వ్యాపారిని దుండగులు చంపేశారు. ఇంట్లోంచి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత ఓ అద్దె ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. హతుడు హైదరాబాద్‌ వికా్‌సపురికి చెందిన చేపల వ్యాపారి పి.రమేశ్‌ (50). ఆయనకు బోరబండ, జవహర్‌నగర్‌లో చేపల దుకాణాలున్నాయి. భార్య, ముగ్గురు కుమారులున్నారు.
 
ఈ నెల 1న రమేశ్‌ సెల్‌కు ఓ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తితో మాట్లాడిన వెంటనే రమేశ్‌, బయటకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాలేదు. అదే రోజు రాత్రి రమేశ్‌ సెల్‌ నుంచి ఆయన పెద్ద కోడలు అరుణకు ఫోనొచ్చింది. రమేశ్‌ వాంతులు చేసుకుంటున్నాడని ఉదయం ఇంటికి పంపిస్తామని అవతలి వ్యక్తి చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. కంగారు పడ్డ ఆమె, విషయాన్ని భర్త ప్రదీ్‌పకు చెప్పింది. ఆయన వెంటనే తన తోబుట్టువులకు చెప్పాడు. ముగ్గురు కలిసి రమేశ్‌ రెండు సెల్‌ఫోన్లకు కాల్‌ చేశారు. స్విచాఫ్‌ అని వచ్చింది. రాత్రంతా తండ్రి కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు మళ్లీ అరుణ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. రమేశ్‌ను వదిలిపెట్టాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని... ఆ డబ్బును హన్మకొండకు తీసుకురావాలని అందులో ఉంది. ఆ నంబరుకు ఫోన్‌ చేసినా స్విచాఫ్‌ రావడంతో ప్రదీప్‌ వెంటనే సంజీవరెడ్డినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అరుణ సెల్‌ఫోన్‌కు సోమవారం ఉదయం కూడా ఇలాంటి మెసేజే వచ్చింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా రమేశ్‌ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేశారు.
 
జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో..
జవహర్‌నగర్‌లో ఉంటున్న శివరామ్‌ కుమార్‌ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి చూడగా ఓ దివాన్‌ మీద కుళ్లిపోయి.. పురుగులు పట్టిన స్థితిలో రమేశ్‌ మృతదేహం కనిపించింది. కాళ్లను బ్రౌన్‌ టేపుతో కట్టేసి.. గొంతు నులిమి హత్య చేసి ఉంటారని.. ఆదృశ్యమైన రోజే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహం ఉన్న గదిని శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఆదివారం (ఈ నెల 2న) అద్దెకు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ మహిళను తీసుకువచ్చి తన భార్యగా చెప్పి అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. సోమవారమే ఇంటి యజమాని శివరామ్‌ను కలిసి అద్దె చెల్లించినట్లు సమాచారం.
 
గదిలో మూడు నల్లటి కవర్లను పోలీసులు గుర్తించారు. వాటిలో ఏముంది అనేది తేలాల్సి ఉంది. శ్రీనివాస్‌ ఎవరు? అతడితో రమేశ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా శ్రీనివా్‌సకు సంబంధించి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలను తీసుకోకుండానే గదిని అద్దెకు ఇచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు యజమాని శివరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దుండగులు రూ.90 లక్షలు డిమాండ్‌ చేశారని.. రూ.30 లక్షల దాకా ఇస్తామని తాము చెప్పామని, మిగతా రూ.60 లక్షల మాటేమిటని వారు ప్రశ్నించారని హతుడి సోదరుడు సత్యయ్య తెలిపాడు. తమకు ఎవరితోనూ ఆర్థిక పరమైన వివాదాలు లేవని చెప్పాడు.

Updated Date - 2020-02-05T11:04:39+05:30 IST