గాంధీలో ప్రస్తుతం ఫర్వాలేదు

ABN , First Publish Date - 2020-06-11T08:33:59+05:30 IST

గాంధీలో ప్రస్తుతం ఫర్వాలేదు

గాంధీలో ప్రస్తుతం ఫర్వాలేదు

సమయానికి టిఫిన్‌, భోజనాలు, వైద్య పరీక్షలు.. కోరంటిలో మాత్రం నిర్లక్ష్యం కనిపించింది

‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించిన పాజిటివ్‌ యువకుడు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి పట్ల ఆస్పత్రి వర్గాలు ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన తర్వాత పాజిటివ్‌ వచ్చిన వారి వ్యవహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... అక్కడికి తరలించే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పాజిటివ్‌ వచ్చిన ఓ చానల్‌ ఉద్యోగిని ఆంధ్రజ్యోతి పలకరించగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రధానంగా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత ఆరు గంటల పాటు కోరంటి ఆస్పత్రిలోనే వేచి చూడాల్సి వచ్చిందని, ఆ సమయంలో 15 మంది పాజిటివ్‌ ఉన్నవారు ఆస్పత్రికి వచ్చినా తరలించడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. కనీసం పాజిటివ్‌ వచ్చిన వారిని జాగ్రత్తగా ఉంచాలన్న ధ్యాస కూడా ఆస్పత్రి వర్గాల్లో కనిపించలేదని, చివరకు వాళ్లు ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్ల కిందే 6 గంటలు వేచిచూసి, అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారని చెప్పారు. ఆ యువకుడు తెలిపిన వివరాల ప్రకారం..  


ఈనెల 8న మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుసుకుని మధ్యాహ్నం 3 గంటలకు కోరంటి ఆస్పత్రికి చేరుకున్నాం. తర్వాత శాంపిల్స్‌ సేకరించి పంపించారు. మరుసటి రోజు (ఈనెల 9న) మధ్యాహ్నం 3 గంటలకు నాకు పాజిటివ్‌ వచ్చిందనే సమాచారం అందింది.


వెంటనే ఇంటికి వెళ్లి, స్నానం చేసి సిద్ధమై, సాయంత్రం 6కు కోరంటి ఆస్పత్రికి చేరుకున్నాను.


నాతో పాటు మరో 14 మంది అక్కడే ఉన్నారు. ఆస్పత్రిలో అడగ్గా వేచిచూడాలని, అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ఆకలేస్తోందని చెప్పగా గాంధీలో ఇస్తారన్నారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు రెండు అంబులెన్స్‌లో 10 మంది బయలుదేరారు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు మరో అంబులెన్స్‌లో నాతో పాటు మొత్తం ఐదుగురిని గాంధీకి తరలించారు.


అర్ధరాత్రి ఆస్పత్రికి చేరి ఫార్మాలిటీస్‌ పూర్తి చేసినప్పటికీ మంచి నీళ్లు కూడా అందించలేదు.  

రాత్రి 3 గంటల సమయంలో ఆరో అంతస్తులో ఓ బెడ్‌ కేటాయించారు. రాత్రంతా ఆకలితోనే ఉన్నాం.

ఈనెల 10న ఉదయం గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి కాస్త మారింంది. తెల్లవారుజామున వాటర్‌బాటిల్‌ అందజేశారు. ఉదయం 9.30 గంటలకు ఉప్మా, చట్నీతో టిఫిన్‌ ఇచ్చారు.


ఉదయం 11 గంటలకు బిస్కెట్లు, టీ ఇచ్చారు.


మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నం, పప్పుతో పాటు క్యాబేజ్‌ కర్రీతో భోజనం ఇచ్చారు.


మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ డాక్టర్‌ వచ్చి లక్షణాల గురించి ఆరా తీశారు. రోజూ చెక్‌చేసి.. కుదుట పడితే హోం క్వారంటైన్‌కు తరలిస్తామని చెప్పారు.


రాత్రి 7.30 గంటలకు అన్నం, పప్పుతో పాటు ఆలుకర్రీతో కూడిన భోజనం ఇచ్చారు.


హాలులో మొత్తం 14 మంది ఉండగా బుధవారం ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మంగళవారం రాత్రి జూనియర్‌ డాక్టర్ల నిరసనల నేపథ్యంలో రాత్రి సరిగా చూడలేకపోయామని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు హామీ ఇచ్చారని ఆ యువకుడు వెల్లడించాడు.

Updated Date - 2020-06-11T08:33:59+05:30 IST