జూలై నాటికి భారీగా కేసులు!

ABN , First Publish Date - 2020-06-22T09:39:42+05:30 IST

కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం అనుసస్తున్న వ్యూహాన్ని కొందరు నిపుణులు విమర్శిస్తున్నారు.

జూలై నాటికి భారీగా కేసులు!

తెలంగాణ వ్యూహంతో తొలుత సత్ఫలితాలు

ట్రేసింగ్‌లో ఆ తర్వాత కొంత వెనుకబడింది

పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి

ప్రజల్లో అవగాహనే దీనికి పరిష్కార మార్గం

‘ఆంధ్రజ్యోతి’తో ఎపిడమాలజిస్టు సమీక్షా సింగ్‌


కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం అనుసస్తున్న వ్యూహాన్ని కొందరు నిపుణులు విమర్శిస్తున్నారు. మరికొందరు సమర్థిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండడంతో విమర్శల తీవ్రత కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంది? వచ్చే రెండు నెలల్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయనే విషయాన్ని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎపిడమాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సమీక్షా సింగ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.


కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం ఎలా ఉంది?

ఇప్పటి దాకా వచ్చిన సాంక్రమిక రోగాలతో పోలిస్తే కొవిడ్‌-19 భిన్నమైనది. గతంలో వచ్చిన సార్స్‌ వంటివి ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల మందికి సంక్రమించలేదు. అంటే దీని వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది. జర్మనీ, ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలు ఈ తరహా వ్యూహాన్నే అనుసరించి విజయం సాధించాయి. ఈ వ్యూహంలో మొదటిది.. వైరస్‌ సోకిన వారిని,  వారితో సంబంధం ఉన్న వారిని కనిపెట్టి పట్టుకోవడం (ట్రేసింగ్‌). దానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం. రెండోది.. ఏయే ప్రాంతాల్లో వైరస్‌ వ్యాపించే అవకాశముందనే విషయాన్ని ముందే పసిగట్టి (సర్వైలెన్స్‌), అవసరమైన చర్యలు తీసుకోవటం.


మూడోది.. పెరిగే కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో పడకలు, వెంటిలేటర్స్‌ వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవటం. ట్రేసింగ్‌ విషయంలో మొదటి దశలో తెలంగాణ మంచి ఫలితాలనే సాధించింది. కానీ, ఆ తర్వాత కొంత వెనుకబడింది. సర్వైలెన్స్‌ విషయంలో కూడా ఇదే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇక వైద్యపరంగా మౌలిక సదుపాయాల విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం అదనపు వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయగలిగింది. నాలుగోది.. అత్యంత ముఖ్యమైనది ప్రజల్లో అవగాహన కల్పించడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో అనేక చర్యలు తీసుకుంటున్నాయి.


కేసుల సంఖ్య పెరగడానికి కారణమేంటి?

పరీక్షలు చేయడం వెనకున్న ప్రధానమైన ఉద్దేశం.. వైరస్‌ సోకిన వ్యక్తులను వేరు చేసి, వారికి అవసరమైన వైద్యసదుపాయం అందించడం. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడం. దీనికి ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా చూస్తే సగటున వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య మహారాష్ట్ర, గుజరాత్‌, వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ ఉంది. అటువంటి సమయంలో ఎక్కువ పరీక్షలు చేయడం కన్నా.. సోకిన వారికి ముందుగా వైద్య సాయం అందించడం ముఖ్యం. మనకు పరిమితమైన వనరులు ఉన్నప్పుడు ఈ పద్ధతి సమర్థంగా పనిచేస్తుంది. అయితే వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందితే ఈ పద్ధతి పనికిరాదు. ఎందుకంటే ఈ వైరస్‌ సోకిన వారిలో 70 శాతం మందిలో లక్షణాలు కనిపించటం లేదు. అందువల్ల ప్రత్యామ్నాయ వ్యూహాలను అనుసరించడం మంచిది. 


ప్రస్తుతం ఏ వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది?

ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో వీలైనంత సమాచారాన్ని స్పష్టంగా ప్రజలకు అందించాలి. అప్పుడే వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక, ఈ వైరస్‌ అందరికీ కరోనా ప్రాణాంతకం కాదు. ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసినప్పుడు వారిలో ఆందోళన తగ్గుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అదే మనకున్న ఏకైక మార్గం. 


ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొవిడ్‌ పరిస్థితి ఎలా ఉందని భావిస్తున్నారు?

మరణాలు, వ్యాధి వ్యాప్తి రేట్ల విషయంలో మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. వ్యాప్తి చెందుతున్న తీరు.. ఐసీఎంఆర్‌ సీరం సర్వే ఆధారంగా చూస్తే ఇంకా సామాజిక వ్యాప్తి చెందినట్లు కనిపించట్లేదు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో చేసిన సర్వేకు.. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత సర్వే ఫలితాలకు మధ్య తేడా ఉంటుంది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా చూస్తే- తెలంగాణలో మరణాల సంఖ్య తక్కువే ఉంది. వ్యాప్తి రేటు కూడా నియంత్రణలో ఉంది. కానీ జూలై చివరినాటికి పరిస్థితులు మారే అవకాశముంది. ఆ సమయానికి ఎన్ని కేసులొస్తాయనే విషయాన్ని ఇప్పుడు కచ్చితంగా చెప్పలేం. కానీ ప్రస్తుత ఒరవడి కొనసాగితే మాత్రం కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది.

- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-22T09:39:42+05:30 IST